📄 ePaper
Wednesday, August 26, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్హైదరాబాద్‌లో మిఠాయి దుకాణాలపై TG SAFE కొరడా !

హైదరాబాద్‌లో మిఠాయి దుకాణాలపై TG SAFE కొరడా !

అపరిశుభ్రత.. గడువు ముగిసిన ఆహారం.. ఫంగస్‌ పట్టిన కూరగాయలు

హైదరాబాద్‌, ఆగస్టు 26 (నవజ్యోతి ప్రతినిధి): నగరంలోని మిఠాయిలు, స్వీట్లు, సావరీస్‌ తయారీ, విక్రయ కేంద్రాలపై తెలంగాణ స్టాండర్డ్స్‌ అథారిటీ ఫర్‌ ఫుడ్‌ అండ్‌ ఎసెన్షియల్‌ డ్రగ్స్‌ (TG SAFE) అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (CURE) పరిధిలో 32 రిటైల్‌, తయారీ కేంద్రాలను 15 ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి. ఫుడ్‌ సేఫ్టీ అధికారులు, పోలీసు సిబ్బంది కలిసి చేపట్టిన ఈ తనిఖీల్లో పలు ఉల్లంఘనలు బయటపడ్డాయి.

15 టన్నుల ఆహార పదార్థాలు స్వాధీనం

తనిఖీల్లో సుమారు 15 టన్నుల ఆహార పదార్థాలను రూ.30 లక్షల విలువతో స్వాధీనం చేసుకున్నారు. కల్తీ అనుమానంతో 35 ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ల్యాబ్‌ నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు.

ఎలుకలు.. పురుగులు.. ఫంగస్‌!

పలు కేంద్రాల్లో పరిశుభ్రత లోపాలు, ఆహార పదార్థాల నిల్వ, నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు, ఫంగస్‌ పట్టిన కూరగాయలు, పురుగులు, ఎలుకల సంచారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఫుడ్‌ లేబులింగ్‌, ప్యాకేజింగ్‌ నిబంధనలు పాటించకపోవడంతో పాటు తప్పుదోవ పట్టించే ప్రకటనలు కూడా గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

బర్ఫీ ఘర్‌ లైసెన్స్‌ సస్పెన్షన్‌

బాచుపల్లిలోని బర్ఫీ ఘర్‌ లైసెన్స్‌ను TG SAFE సస్పెండ్‌ చేసింది. వెంటనే వ్యాపార కార్యకలాపాలు నిలిపివేయాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన ఇతర సంస్థలకు 12 ఇంప్రూవ్‌మెంట్‌ నోటీసులు, నాలుగు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

పండుగల నేపథ్యంలో ప్రత్యేక నిఘా

మిలాద్‌-ఉన్‌-నబీ, రక్షాబంధన్‌ వంటి పండుగల నేపథ్యంలో స్వీట్లు, సావరీస్‌ వినియోగం పెరిగే అవకాశం ఉండటంతో ఆహార భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా తనిఖీలు కొనసాగనున్నాయి.

డార్క్‌ స్టోర్లపైనా చర్యలు

ఇటీవల హైదరాబాద్‌లోని క్విక్‌ కామర్స్‌ డార్క్‌ స్టోర్లపైనా TG SAFE తనిఖీలు నిర్వహించింది. బిగ్‌బాస్కెట్‌, బ్లింకిట్‌, జెప్టోకు చెందిన కేంద్రాల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్ర నిల్వలు వంటి ఉల్లంఘనలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

ఆహార భద్రతపై కఠిన నిఘా: ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం వహించే సంస్థలపై చర్యలు మరింత కఠినతరం కానున్నట్లు తాజా తనిఖీలు స్పష్టం చేస్తున్నాయి.
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!