వివాహేతర సంబంధం ఉందని మాత్రమే మూడో వ్యక్తిని బాధ్యురాలిని చేయలేం
న్యూఢిల్లీ, ఆగస్టు 26 (నవజ్యోతి ప్రతినిధి): భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని తన వైవాహిక జీవితాన్ని నాశనం చేసిందంటూ మరో మహిళపై రూ.50 లక్షల నష్టపరిహారం కోరిన భార్యకు ఢిల్లీ సాకేత్ కోర్టులో నిరాశ ఎదురైంది. భర్తతో సంబంధం పెట్టుకున్న మహిళ ఉద్దేశపూర్వకంగా వివాహాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రేరేపించిందని నిరూపించడంలో భార్య విఫలమైందని జిల్లా జడ్జి అతుల్ అహ్లావత్ ఆగస్టు 20న తీర్పు ఇచ్చారు. 1
రూ.1 కోటి నుంచి రూ.50 లక్షలకు తగ్గించిన డిమాండ్
2001లో వివాహం జరిగిన ఈ దంపతుల మధ్య 2009 తర్వాత సమస్యలు మొదలయ్యాయని భార్య తన పిటిషన్‌లో పేర్కొన్నారు. భర్త 2013లో ఇంటిని విడిచిపెట్టారని, అనంతరం మరో మహిళతో సంబంధం కొనసాగించారని ఆరోపించారు. 2015లో వారు రెండో వివాహం చేసుకున్నారని, 2016లో వారికి కుమార్తె జన్మించిందని ఆమె పేర్కొన్నారు. మొదట రూ.1 కోటి నష్టపరిహారం కోరగా, అనంతరం ఆ మొత్తాన్ని రూ.50 లక్షలకు తగ్గించారు. 2
‘భర్తను నాపై నుంచి దూరం చేసింది’
తన భర్తకు తాను భార్యనని తెలిసినా మరో మహిళ ఉద్దేశపూర్వకంగా అతని ప్రేమను తన వైపు మళ్లించిందని, దాంతో తాను మానసిక వేదన, ఆర్థిక ఇబ్బందులు, భర్త సహచర్యాన్ని కోల్పోయానని భార్య వాదించారు. అయితే ఈ ఆరోపణలకు సరిపడే ప్రత్యక్ష ఆధారాలు లేవని కోర్టు గుర్తించింది.
భర్తను ఇంటి నుంచి వెళ్లిపోయేలా మరో మహిళ ప్రేరేపించిందని చెప్పేందుకు నమ్మదగిన ఆధారాలు లేవని, డ్రైవర్ ద్వారా తనకు తెలిసిన విషయాలను భార్య చెప్పినప్పటికీ ఆ డ్రైవర్ అప్పటికే మరణించడంతో అతని వాంగ్మూలాన్ని ఆధారంగా తీసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. 3
వివాహేతర సంబంధం ఒక్కటే ఆధారం కాదు
ఇద్దరు సమ్మతించిన పెద్దల మధ్య వివాహేతర సంబంధం ఏర్పడటం, దాని ఫలితంగా సంతానం కలగడం మాత్రమే ‘Alienation of Affection’ అనే సివిల్ క్లెయిమ్ విజయవంతం కావడానికి సరిపోదని కోర్టు స్పష్టం చేసింది. మూడో వ్యక్తి భర్తను భార్య నుంచి దూరం చేసేందుకు చురుకుగా ప్రేరేపించిందని, ఉద్దేశపూర్వకంగా వివాహ బంధాన్ని దెబ్బతీసిందని నిరూపించాల్సి ఉంటుందని పేర్కొంది. 4
భర్తకు ఉన్న బాధ్యతను మరో మహిళపై మోపలేం
వైవాహిక బంధాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రధానంగా భర్తపైనే ఉంటుందని కోర్టు పేర్కొంది. భర్త నుంచి వచ్చిన ప్రేమ లేదా సంబంధాన్ని మరో మహిళ తిరస్కరించాల్సిన ప్రత్యేక చట్టపరమైన బాధ్యత ఆమెపై లేదని స్పష్టం చేసింది. కేవలం భర్తతో సంబంధం ఉందన్న కారణంతో ఆమెను నష్టపరిహారానికి బాధ్యురాలిని చేయలేమని తేల్చింది. 5
వివాహంలో ముందే సమస్యలు ఉన్నాయా?
కేసు విచారణలో భార్య స్వయంగా తమ దాంపత్య జీవితంలో శారీరక, మానసిక, భావోద్వేగ వేధింపులు జరిగిన సందర్భాలు ఉన్నాయని అంగీకరించారు. వివాహం జరిగిన మొదటి రెండు, మూడు సంవత్సరాల తర్వాత భర్త తనతో శారీరక సాన్నిహిత్యాన్ని ఎక్కువ కాలం నిరాకరించారని కూడా ఆమె పేర్కొన్నారు.
దీంతో మరో మహిళ తమ జీవితంలోకి రాకముందే భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ, అనురాగంతో కూడిన దాంపత్య బంధం కొనసాగుతోందని నిరూపించడంలోనూ ఆమె విఫలమయ్యారని కోర్టు పేర్కొంది. 6
‘Alienation of Affection’ అంటే ఏమిటి?
భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ, అనురాగాన్ని మూడో వ్యక్తి ఉద్దేశపూర్వకంగా దెబ్బతీసి ఒకరిని మరొకరి నుంచి దూరం చేస్తే నష్టపరిహారం కోరే సివిల్ చర్యను Alienation of Affection అంటారు. దీనిని ‘Heart-Balm Action’ అని కూడా వ్యవహరిస్తారు.
భారతదేశంలో ఈ టార్ట్ ప్రత్యేకంగా చట్టంగా రూపొందించబడలేదు. అయితే Pinakin Mahipatray Rawal v. State of Gujarat కేసులో సుప్రీంకోర్టు చేసిన పరిశీలనల ఆధారంగా ఈ సిద్ధాంతానికి భారత న్యాయవ్యవస్థలో ప్రస్తావన వచ్చింది.
2025లో ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది?
ఇదే అంశంపై 2025లో ఢిల్లీ హైకోర్టు కీలకంగా స్పందించింది. వివాహ బంధంలో మూడో వ్యక్తి ఉద్దేశపూర్వకంగా జోక్యం చేసుకుని జీవిత భాగస్వామి ప్రేమను దూరం చేశాడని నిరూపించగలిగితే, ఆ వ్యక్తిపై సివిల్ కేసు దాఖలు చేయడం చట్టపరంగా సాధ్యమేనని పేర్కొంది. దీంతో ఈ తరహా కేసులకు భారత న్యాయవ్యవస్థలో ఒక పరిమిత పరిధి ఉన్నట్లు స్పష్టమైంది.
అయితే తాజా తీర్పు చెప్పిన కీలక విషయం ఇదే
మూడో వ్యక్తిపై కేసు వేయడానికి అవకాశం ఉందన్నది, ప్రతి వివాహేతర సంబంధానికి నష్టపరిహారం చెల్లించాల్సిందే అన్న అర్థం కాదని తాజా సాకేత్ కోర్టు తీర్పు స్పష్టం చేసింది. ముందుగా దాంపత్యంలో నిజమైన ప్రేమ, అనురాగం ఉన్నట్లు.. ఆ తర్వాత మూడో వ్యక్తి ఉద్దేశపూర్వక జోక్యంతో అది నాశనమైనట్లు.. ఆ నష్టానికి నేరుగా ఆ వ్యక్తి చర్యలే కారణమని ఆధారాలతో నిరూపించాల్సి ఉంటుందని కోర్టు పేర్కొంది.
అఫైర్ నేరం కాకపోయినా.. సివిల్ పరిణామాలు?
సుప్రీంకోర్టు Joseph Shine v. Union of India తీర్పు తర్వాత వ్యభిచారం (adultery) క్రిమినల్ నేరం కాదు. అయితే వివాహేతర సంబంధం వల్ల ఇతర చట్టపరమైన లేదా సివిల్ పరిణామాలు ఉండవచ్చా అన్న ప్రశ్న వేరు. తాజా తీర్పు కూడా అదే తేడాను స్పష్టం చేస్తూ, కేవలం అఫైర్ ఉందన్న కారణంతో మూడో వ్యక్తిపై నష్టపరిహారం విధించలేమని తేల్చింది.

