స్కూల్‌కు వెళ్తున్న ఏడేళ్ల చిన్నారి లారీ కింద పడి మృతి.. రాత్రి ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడు దుర్మరణం
రెండు కుటుంబాల్లో విషాదం.. మార్చురీ వద్ద బంధువుల రోదనలు
బాన్సువాడ, ఆగస్టు 27 (నవజ్యోతి ప్రతినిధి):
బాన్సువాడ ప్రాంతంలో వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. గురువారం ఉదయం పాఠశాలకు వెళ్తున్న ఏడేళ్ల చిన్నారి లారీ ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయింది. రెండు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందడంతో బాన్సువాడ ఏరియా ఆసుపత్రి మార్చురీ వద్ద విషాద వాతావరణం నెలకొంది.
ట్రాక్టర్‌ను ఢీకొని యువకుడు మృతి
బాన్సువాడ–కొత్తబాది ప్రధాన రహదారిపై మొగలాన్పల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి ప్రమాదం జరిగింది. బాన్సువాడ వైపు నుంచి కొత్తబాది వైపు వెళ్తున్న ద్విచక్ర వాహనం జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు పాల్త్యా రాజు (28) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు కొత్తబాది గిర్ని తండాకు చెందిన చత్రు కుమారుడు. వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న రాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న బాన్సువాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
రోడ్డుపక్కన తగిన వెలుతురు, హెచ్చరిక గుర్తులు లేకుండా ట్రాక్టర్‌ను నిలిపి ఉంచడం ప్రమాదానికి కారణమా? లేక ద్విచక్ర వాహనం అతివేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్కూల్‌కు వెళ్తూ చిన్నారి దుర్మరణం
గురువారం ఉదయం బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద మరో విషాదకర ప్రమాదం జరిగింది. అరాఫత్ కాలనీకి చెందిన మహమ్మద్ రఫీ తన ముగ్గురు పిల్లలను ద్విచక్ర వాహనంపై పాఠశాలకు తీసుకెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది.
ఈ ఘటనలో బైక్‌పై ఉన్న ఏడేళ్ల జైనబ్ ఫాతిమా కిందపడగా లారీ చక్రం ఆమెపై నుంచి వెళ్లింది. తీవ్ర గాయాలతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఫ్లెక్సీల తొలగింపు
ప్రమాద విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రేష్మా బేగం ఏజాజ్, కౌన్సిలర్లు కాలేఖ్, హకీమ్‌తో పాటు వివిధ పార్టీల నాయకులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తాడ్కోల్ చౌరస్తా వద్ద రహదారికి అడ్డంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వల్ల వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎస్హెచ్ఓ తుల శ్రీధర్ అక్కడి ఫ్లెక్సీలను తొలగించారు.
మార్చురీ వద్ద విషాదం
బుధవారం రాత్రి ట్రాక్టర్‌ను ఢీకొని మృతి చెందిన పాల్త్యా రాజు మృతదేహం, గురువారం ఉదయం లారీ ప్రమాదంలో మృతి చెందిన జైనబ్ ఫాతిమా మృతదేహం బాన్సువాడ ఏరియా ఆసుపత్రి మార్చురీలో ఉండటంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
రహదారి భద్రతపై ఆందోళన
బాన్సువాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో రోడ్డు భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళల్లో రహదారులపై హెచ్చరిక లైట్లు, రిఫ్లెక్టర్లు లేకుండా వాహనాలను నిలిపివేయడం, ప్రధాన కూడళ్ల వద్ద దృశ్యమానతను అడ్డుకునే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ప్రమాదాలకు కారణమవుతున్నాయని వారు చెబుతున్నారు. వాహనాల వేగ నియంత్రణ, రహదారులపై సరైన వెలుతురు, ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

