మొత్తం 16,41,470 టన్నుల దేశ-నిర్దిష్ట కోటాలో.. 9,46,616 టన్నులు ఎంఎఫ్ఎన్ కేటగిరీలో, మరో 6,94,853 టన్నులు ఎఫ్‌టీఏ కేటగిరీలో ఉన్నాయి.
ప్రస్తుతం భారత్ ఏటా సుమారు 40 లక్షల టన్నుల స్టీల్‌ను యూరోపియన్ యూనియన్‌కు ఎగుమతి చేస్తోంది. కొత్త కోటా విధానం భారత ఎగుమతిదారులకు యూరోపియన్ మార్కెట్లో వాణిజ్య ప్రాప్యతను మరింత సులభతరం చేసే అవకాశముంది.
నాన్-అలాయ్, అలాయ్ హాట్-రోల్డ్ షీట్లు, కోల్డ్-రోల్డ్ షీట్లు, మెటాలిక్ కోటెడ్ షీట్లు, ఆర్గానిక్ కోటెడ్ షీట్లు, టిన్ మిల్ ఉత్పత్తులు, స్టెయిన్లెస్ స్టీల్, రీబార్లు, వైర్ రాడ్లు, పైపులు, ట్యూబ్‌లు తదితర ఉత్పత్తులకు కోటాలు వర్తించనున్నాయి.
అత్యధికంగా హాట్-రోల్డ్ షీట్లు, స్ట్రిప్స్‌కు 5,09,605 టన్నుల కోటా కేటాయించారు. ఇందులో 2,99,197 టన్నులు ఎంఎఫ్ఎన్, 2,10,408 టన్నులు ఎఫ్‌టీఏ కింద ఉన్నాయి.
కోల్డ్-రోల్డ్ షీట్లకు 2,18,658 టన్నులు, మెటాలిక్ కోటెడ్ షీట్లకు 1,97,860 టన్నులు, ఆర్గానిక్ కోటెడ్ షీట్లకు 1,86,038 టన్నులు, నాన్-అలాయ్, ఇతర అలాయ్ క్వార్టో ప్లేట్లకు 1,81,835 టన్నుల కోటా ఉంది.
మరో మెటాలిక్ కోటెడ్ షీట్ల కేటగిరీకి 85,157 టన్నులు, స్టెయిన్లెస్ స్టీల్ బార్లు, లైట్ సెక్షన్లకు 79,278 టన్నుల కోటా కేటాయించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉక్కు అధిక ఉత్పత్తి ప్రభావాల నుంచి తమ పరిశ్రమను రక్షించేందుకు ఈయూ స్టీల్ ఓవర్‌క్యాపాసిటీ రెగ్యులేషన్‌ను జూలై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది.
దీని కింద నిర్దిష్ట పరిమితి దాటిన దిగుమతులపై 50 శాతం సుంకం విధించే నిబంధన ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌కు ప్రత్యేక కోటా లభించడం ఎగుమతిదారులకు ప్రాధాన్యం సంతరించుకుంది.
భారత్‌కు దేశ-నిర్దిష్ట కోటా ఉన్న ఉత్పత్తుల కేటగిరీల్లో అదనపు కోటా పరిమాణాలను పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ అదనపు పరిమాణాలను సంబంధిత కోటాలు కలిగిన ఈయూ స్వేచ్ఛా వాణిజ్య భాగస్వామ్య దేశాల మధ్య పోటీ ద్వారా కేటాయిస్తారు.
భారత్‌కు ప్రత్యేక కోటా లేని కేటగిరీల్లో సాధారణ అవశేష కోటాలు, ఈయూ వాణిజ్య భాగస్వామ్య దేశాలకు అందుబాటులో ఉండే ప్రాధాన్య కోటాలను వినియోగించుకునే అవకాశం ఉంటుంది.
ఒప్పందం అమల్లోకి వచ్చిన ఏడాది తర్వాత తొలి సమీక్ష చేపట్టనున్నారు. ఆ తర్వాత ప్రతి ఐదేళ్లకు కోటాలను సమీక్షించే విధానం ఉంటుంది.
భారత్ నుంచి దిగుమతయ్యే స్టీల్ ఉత్పత్తులకు సంబంధించిన నిబంధనలను ఈయూ మార్చాలనుకుంటే భారత్‌తో వెంటనే సంప్రదింపులు జరపాలని ముసాయిదా ఒప్పందంలో పేర్కొన్నారు.
భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై జనవరి 27న చర్చలు ముగిశాయి. ఈ ఏడాది చివరినాటికి ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉండగా, వచ్చే ఏడాది నుంచి అమలు చేసే అవకాశముంది. స్టీల్ కోటా భారత ఉక్కు పరిశ్రమకు యూరోపియన్ మార్కెట్లో కీలక అవకాశంగా మారనుంది.

