కామారెడ్డి, ఆగస్టు 20 (నవజ్యోతి ప్రతినిధి):

స్టేషన్ బెయిల్ ఇప్పించేందుకు రూ.30 వేలు లంచం తీసుకుంటూ రాజంపేట ఎస్సై
దువ్వల ఆంజనేయులు ఏసీబీ అధికారులకు
రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. గురువారం కామారెడ్డి పట్టణంలోని ఆయన
నివాసంలో ఏసీబీ అధికారులు ట్రాప్ నిర్వహించి ఎస్సైను పట్టుకున్నారు.
ఇటీవలే బిక్కనూర్ నుంచి రాజంపేటకు బదిలీ అయిన
ఎస్సై ఆంజనేయులు.. రాజంపేటలో బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే ఏసీబీ
ట్రాప్‌లో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.
సిమెంట్ షాపు వివాదంలో కేసులు
రాజంపేట మండలంలోని ఓ సిమెంట్ షాపు విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం
చోటుచేసుకుంది. అనుమతి లేకుండా ఓ కంపెనీ సిమెంట్‌ను దించుకున్నారనే
అంశంపై షాపు నిర్వాహకులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాలపై కేసులు
నమోదైనట్లు సమాచారం. ఈ క్రమంలో ఓ వర్గానికి స్టేషన్ బెయిల్ ఇప్పించేందుకు
ఎస్సైను ఆశ్రయించారు.
రూ.30 వేలు డిమాండ్!
స్టేషన్ బెయిల్‌తో పాటు కేసులో చార్జిషీట్ దాఖలు సమయంలో అనుకూలంగా
వ్యవహరించేందుకు ఎస్సై ఆంజనేయులు రూ.30 వేలు లంచం డిమాండ్ చేసినట్లు
ఏసీబీకి ఫిర్యాదు అందింది. దీంతో ఫిర్యాదును పరిశీలించిన ఏసీబీ అధికారులు
పథకం ప్రకారం ట్రాప్ ఏర్పాటు చేశారు.
డబ్బులు తీసుకుంటుండగా పట్టివేత
ఏసీబీ సూచన మేరకు బాధితుడు గురువారం ఎస్సై నివాసానికి వెళ్లి రూ.30 వేలు
అందజేశారు. ఆంజనేయులు డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అక్కడికి
చేరుకుని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని స్వాధీనం
చేసుకున్నారు. అనంతరం ఎస్సైను అరెస్టు చేసి హైదరాబాద్ నాంపల్లిలోని
ఎస్‌పీఈ, ఏసీబీ కేసుల విచారణకు సంబంధించిన II అదనపు ప్రత్యేక
న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
సోదాలు.. దర్యాప్తు
ఎస్సై నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి పలు రికార్డులు,
పత్రాలను పరిశీలించారు. కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని
ఏసీబీ వెల్లడించింది. ఫిర్యాదుదారుడి వివరాలను భద్రతా కారణాలతో
అధికారులు వెల్లడించలేదు.
ఎస్సై దువ్వల ఆంజనేయులు రూ.30 వేలు లంచం కేసులో ఏసీబీ ట్రాప్‌లో
పట్టుబడటం స్థానికంగా చర్చనీయాంశమైంది.

