ఆషాఢ మాసంలో ప్రత్యేక పూజలు.. భక్తులతో కళకళలాడిన ఆలయం
బిక్కనూర్, జూలై 18 (నవజ్యోతి ప్రతినిధి):
ఆషాఢ మాసం సందర్భంగా బిక్కనూర్‌లోని శ్రీ రేణుకా మాత ఆలయంలో శనివారం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పూలతో శాకాంబరీ దేవి రూపంలో సుందరంగా అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు.
హైదరాబాద్‌లో న్యాయవాదిగా సేవలందిస్తున్న బిక్కనూర్‌కు చెందిన మునిగల్ల నాగరాజు గౌడ్ కుటుంబ సభ్యులు ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శ్రీ రేణుకా మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి శాకాంబరీ అలంకరణ చేయించడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారు.
శాకాంబరీ రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం విశేష పుణ్యప్రదమని విశ్వసించే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలు, సుఖశాంతులు, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారిని ప్రార్థించారు. శాకాంబరీ అలంకరణతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా, రోజంతా భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

