విద్యార్థులు, ఉద్యోగుల ప్రయోజనాలకు పూర్తి రక్షణ.. మంత్రి వివేక్ వెంకటస్వామి
హైదరాబాద్, ఆగస్టు 21 (నవజ్యోతి ప్రతినిధి):
పాలిటెక్నిక్ విద్యను మరింత బలోపేతం చేసి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా
శిక్షణను తీర్చిదిద్దడంతో పాటు విద్యార్థులకు ఉపాధి అవకాశాలను విస్తరించేందుకే
పాలిటెక్నిక్‌లను కమిషనరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్
అండ్ ట్రైనింగ్ (CET) పరిధిలోకి తీసుకువస్తున్నట్లు శక్తి
(కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాలు), గనుల శాఖ మంత్రి
వివేక్ వెంకటస్వామి తెలిపారు.
గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. పాలిటెక్నిక్‌లను
కమిషనరేట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (CTE) నుంచి CET పరిధిలోకి
తీసుకువస్తూ 2026 జూన్ 16న జీఓ 97 జారీ చేసినట్లు తెలిపారు.
ఇది కేవలం పరిపాలనా పునర్వ్యవస్థీకరణ మాత్రమేనని, పాలిటెక్నిక్‌ల గుర్తింపు,
హోదాలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.
డిప్లొమా, పరీక్షల విధానంలో మార్పు లేదు
ప్రస్తుతం కొనసాగుతున్న మూడేళ్ల AICTE గుర్తింపు పొందిన డిప్లొమా
కోర్సులు, ఫీజులు, విద్యా విధానం యథాతథంగా కొనసాగుతాయని మంత్రి
తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజినీరింగ్ కళాశాలల్లో లేటరల్
ఎంట్రీ కోసం TG ECETకు అర్హులుగానే ఉంటారని స్పష్టం చేశారు.
SBTETలోని పాలిటెక్నిక్ విభాగం CET పరిధిలో ప్రత్యేక విభాగంగా పనిచేస్తుందని,
ప్రవేశాలు, పరీక్షలు, డిప్లొమా సంబంధిత విద్యా వ్యవహారాలను ఇదే విభాగం
కొనసాగిస్తుందని తెలిపారు.
ఉద్యోగుల హక్కులకు పూర్తి రక్షణ
పాలిటెక్నిక్‌లలో ఉన్న ఉద్యోగుల పోస్టులు, కేడర్ బలంలో ఎలాంటి కోత ఉండదని
మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల హోదా, వేతన స్కేళ్లు, డీఏ,
ఇంక్రిమెంట్లు, సీనియారిటీ, పదోన్నతులు, GPF, PRAN, గ్రాట్యుటీ, పెన్షన్
వంటి ప్రయోజనాలు పూర్తిగా కొనసాగుతాయని తెలిపారు.
నియామకాలు TGPSC ద్వారానే కొనసాగుతాయని, పాలిటెక్నిక్ ఉద్యోగులు YISU లేదా
PPP ఉద్యోగులుగా మారరని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగానే
కొనసాగుతారని మంత్రి స్పష్టం చేశారు.
పరిశ్రమలతో అనుసంధానం.. ప్లేస్‌మెంట్లు
సాంకేతిక విద్యను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం టాటా
టెక్నాలజీస్‌తో రూ.2,300 కోట్ల విలువైన 10 ఏళ్ల భాగస్వామ్యాన్ని
కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్
టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి చేసినట్లు చెప్పారు.
Cisco, Microsoft, Mahindra & Mahindra, GMR, Swiggy, Dr. Reddy’s
Laboratories తదితర 200కుపైగా పరిశ్రమలతో అవగాహన ఒప్పందాలు
కుదిరాయని తెలిపారు. ప్లేస్‌మెంట్లు, అప్రెంటిస్‌షిప్‌లు, ఇంటర్న్‌షిప్‌లు,
పాఠ్యాంశాల రూపకల్పనలో ఈ పరిశ్రమల భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు.
ప్రతి పాలిటెక్నిక్‌లో ప్రత్యేక ప్లేస్‌మెంట్ సెల్ ఏర్పాటు
చేయడంతో క్యాంపస్ ప్లేస్‌మెంట్లు, అంతర్జాతీయ ధ్రువపత్రాలు, ఇంటర్న్‌షిప్‌లు,
ఔత్సాహిక పారిశ్రామిక అవకాశాలు, విదేశీ ఉపాధి అవకాశాలు విద్యార్థులకు
అందుబాటులోకి వస్తాయని మంత్రి వివరించారు.
పాలిటెక్నిక్ ఆస్తులు CET పరిధిలోనే
పాలిటెక్నిక్‌లకు సంబంధించిన భూములు, భవనాలు, ఇతర ఆస్తులు YISUకు
బదిలీ కావని మంత్రి స్పష్టం చేశారు. అవన్నీ CET పరిధిలోనే
కొనసాగుతాయని తెలిపారు.
నైపుణ్యాభివృద్ధిలో తెలంగాణ ముందంజలో ఉందని, దేశంలోనే అత్యధికంగా
నాలుగు PM SETU క్లస్టర్లు రాష్ట్రానికి మంజూరయ్యాయని
మంత్రి పేర్కొన్నారు.
పునర్వ్యవస్థీకరణపై సంయుక్త టాస్క్‌ఫోర్స్
పునర్వ్యవస్థీకరణను పారదర్శకంగా అమలు చేసేందుకు SBTET, AICTE, YISU,
పాలిటెక్నిక్ అధ్యాపకుల ప్రతినిధులతో సంయుక్త సమన్వయ టాస్క్‌ఫోర్స్
ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు,
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పారు.
పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయడం, విద్యార్థులు–ఉద్యోగుల హక్కులను
కాపాడటం, పరిశ్రమలతో అనుసంధానం పెంచి ఉపాధి, అప్రెంటిస్‌షిప్, ఇంటర్న్‌షిప్,
అంతర్జాతీయ అవకాశాలను విస్తరించడమే ప్రభుత్వ లక్ష్యం.

