అధిక యూరియా వినియోగంతో నేల ఆరోగ్యానికి ముప్పు.. ధరలను రేషనలైజ్ చేయాలి: మంత్రి తుమ్మల
హైదరాబాద్, ఆగస్టు 25 (నవజ్యోతి ప్రతినిధి): ఎరువుల ధరల్లో భారీ వ్యత్యాసం కారణంగా రైతులు తక్కువ ధరకు లభించే యూరియా వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దీంతో పంటలకు అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందించలేక నేల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. డీఏపీ, కాంప్లెక్స్, యూరియా ధరలను రేషనలైజ్ చేసి రైతులు సమతుల్య ఎరువుల వినియోగం వైపు వెళ్లేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
పదేళ్లలో భారీగా పెరిగిన యూరియా వినియోగం
తెలంగాణలో యూరియా వినియోగం 2015-16లో 14 లక్షల మెట్రిక్ టన్నులు ఉండగా, 2025-26 నాటికి 20.70 లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని మంత్రి తెలిపారు. యూరియా, డీఏపీపై అధిక సబ్సిడీ ఉండటం కూడా వాటి వినియోగం పెరగడానికి కారణమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్‌పీకే వినియోగ నిష్పత్తి 12.6:4.8:1గా ఉండగా, సిఫారసు చేసిన నిష్పత్తి 4:2:1 మాత్రమేనని వివరించారు.
ధరల్లో భారీ వ్యత్యాసం
45 కిలోల యూరియా బస్తా సుమారు రూ.240-266కే లభిస్తుండగా, 50 కిలోల డీఏపీ బస్తా రూ.1,350, 19:9:19 కాంప్లెక్స్ ఎరువుల బస్తా రూ.1,750గా ఉందని మంత్రి తెలిపారు. ధరల వ్యత్యాసంతో రైతులు పంటకు అవసరమైన పోషకాల సమతుల్యతను పట్టించుకోకుండా యూరియా, డీఏపీని అధికంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు.
అధిక యూరియాతో నేల ఆరోగ్యానికి నష్టం
వరి పంటలో సిఫారసు చేసిన మోతాదుతో పోలిస్తే రైతులు అధిక మోతాదులో ఫాస్పరస్, నైట్రోజన్‌ను వినియోగిస్తున్నట్లు గుర్తించామని మంత్రి తెలిపారు. మొక్కజొన్నలో సిఫారసు చేసిన మూడు బస్తాల యూరియాకు బదులుగా ఐదు నుంచి పది బస్తాల వరకు వినియోగిస్తున్న పరిస్థితి ఉందన్నారు. పత్తిలో నైట్రోజన్ వినియోగం సిఫారసు కంటే 10-15 శాతం అధికంగా, పొటాష్ వినియోగం సుమారు 30 శాతం తక్కువగా ఉందని వివరించారు.
అసమతుల్య ఎరువుల వినియోగంతో నేలలో జింక్, బోరాన్ వంటి సూక్ష్మ పోషకాల లోపాలు ఏర్పడటంతో పాటు నైట్రోజన్ లీచింగ్ పెరిగి నేల, నీటి కాలుష్యానికి దారితీస్తోందని తెలిపారు. చీడపీడలు, తెగుళ్ల ఉధృతి పెరిగి సాగు ఖర్చులు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
పంటల నాణ్యతపైనా ప్రభావం
అధిక మోతాదులో యూరియా వినియోగం నేల ఆరోగ్యంతో పాటు పంటల నాణ్యతపైనా ప్రభావం చూపే అవకాశం ఉందని తుమ్మల తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లలో మన వ్యవసాయ ఉత్పత్తులకు గిరాకీ కొనసాగాలంటే ఎరువుల వినియోగంలో సమతుల్యత పాటించడం అవసరమన్నారు.
ధరల విధానాన్ని మార్చాలి
యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించాలని కేంద్రాన్ని పలుమార్లు కోరినా స్పందన కనిపించడం లేదని మంత్రి అన్నారు. మోతాదుకు మించి యూరియా వినియోగాన్ని తగ్గించేలా కేంద్రం ఇప్పటికైనా చర్యలు చేపట్టాలని కోరారు.
ఒకవైపు ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెబుతూ.. మరోవైపు రైతులు సమతుల్య ఎరువుల వినియోగం వైపు వెళ్లేలా ధరల విధానంలో మార్పులు చేయకపోవడం సరికాదన్నారు. కేవలం యూరియా వినియోగాన్ని తగ్గించాలని రైతులకు సూచించడం వల్ల ఆశించిన ఫలితాలు రావని, ధరల్లో సమతుల్యత తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని స్పష్టం చేశారు.
సిఫారసు చేసిన మోతాదులోనే వినియోగం
రైతులు శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మోతాదులోనే ఎరువులను వినియోగించేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువులు, వర్మీకంపోస్ట్, బయోఫెర్టిలైజర్స్ వంటి ప్రత్యామ్నాయ పోషక వనరులను వినియోగించాలని సూచించారు. యూరియా, డీఏపీకి ప్రత్యామ్నాయంగా నానో యూరియా, నానో డీఏపీని సిఫారసు చేసిన మోతాదులో ఉపయోగించవచ్చని తెలిపారు.
రైతునేస్తం ద్వారా అవగాహన
మంత్రి ఆదేశాల మేరకు ఎరువుల సమతుల్య వినియోగం, అధిక యూరియా వాడకం వల్ల కలిగే అనర్థాలపై రైతునేస్తం కార్యక్రమం ద్వారా వ్యవసాయ శాఖ రైతులకు అవగాహన కల్పిస్తోంది. మంగళవారం నిర్వహించిన రైతునేస్తం 104వ భాగంలో ఎరువుల వినియోగం, నానో యూరియా తదితర అంశాలపై శాస్త్రవేత్తలు సూచనలు అందించారు.
27 నుంచి అన్ని జిల్లాల్లో ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన Fertilizer Sale App (FFS App) ద్వారా ఎరువుల విక్రయాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్న నేపథ్యంలో, యాప్ విధానంపై క్షేత్రస్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం 22 జిల్లాల్లో ఈ యాప్ ద్వారా ఎరువుల విక్రయాలు జరుగుతుండగా, మిగిలిన జిల్లాల్లోనూ ఈ నెల 27 నుంచి సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది.
ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్‌లో రైతులు ఎదుర్కొనే సమస్యలను కేంద్ర నోడల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి సత్వరమే పరిష్కరించాలని, ఎరువుల లభ్యత, వినియోగ విధానం, సమతుల్య ఎరువుల వినియోగంపై రైతులకు నిరంతరం అవగాహన కల్పించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.

