📄 ePaper
Tuesday, August 25, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్యాకెట్‌ ఫుడ్‌పై ఇక ‘రెడ్‌ అలర్ట్‌’ తప్పదా?

ప్యాకెట్‌ ఫుడ్‌పై ఇక ‘రెడ్‌ అలర్ట్‌’ తప్పదా?

చిప్స్‌ – కూల్‌డ్రింక్స్‌లో చక్కెర, ఉప్పు, కొవ్వుపై హెచ్చరికల విషయంలో కేంద్రం – ఆహార పరిశ్రమ మధ్య పోరు

న్యూఢిల్లీ, ఆగస్టు 25 (నవజ్యోతి ప్రతినిధి): ప్యాకెట్‌ ఫుడ్‌పై చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వు అధికంగా ఉంటే వినియోగదారులను ముందుగానే హెచ్చరించే లేబుళ్ల విషయంలో కేంద్రం – ఆహార నియంత్రణ సంస్థపై సుప్రీంకోర్టు ఒత్తిడి పెంచింది. ఈ అంశంపై తాజాగా వచ్చిన రాయిటర్స్‌ పరిశోధనాత్మక కథనం మరో కీలక కోణాన్ని వెలుగులోకి తెచ్చింది.

హెచ్చరికలపై వెనక్కి తగ్గిన FSSAI

ప్యాకెట్‌ ముందు భాగంలో అధిక చక్కెర – ఉప్పు – సంతృప్త కొవ్వు ఉన్నట్లు సులభంగా అర్థమయ్యే హెచ్చరికలు ఇవ్వాలన్న ప్రతిపాదనపై FSSAI గతంలో చర్యలు చేపట్టింది. అయితే ఆగస్టులో సుప్రీంకోర్టుకు సమర్పించిన ప్రతిపాదనలో రంగుల హెచ్చరికలకు బదులుగా చక్కెర, సంతృప్త కొవ్వు, ఉప్పు పరిమాణాలను చూపించే పట్టికను సూచించింది.

దీంతో ప్యాకెట్‌ చూసిన వెంటనే ఉత్పత్తిలో ఆరోగ్యానికి సంబంధించిన ప్రమాదాన్ని గుర్తించే విధంగా హెచ్చరిక ఇవ్వడం కంటే – పోషక విలువల పట్టికను చదివి వినియోగదారుడు స్వయంగా అర్థం చేసుకోవాల్సి వస్తుందని ఆరోగ్య కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి

ఈ అంశంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రం – FSSAI వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహార పదార్థాల్లో ఉండే చక్కెర, ఉప్పు, కొవ్వు వంటి అంశాలపై వినియోగదారులకు స్పష్టమైన సమాచారం అందించాల్సిన అవసరాన్ని కోర్టు ప్రస్తావించింది.

ఆహార పరిశ్రమ ఒత్తిడి ఏమైనా ఉందా అన్న కోణంలోనూ కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది. తుది నిర్ణయం తీసుకుని సమర్పించాలని కేంద్రానికి గడువు ఇచ్చింది.

బిగ్‌ ఫుడ్‌ సంస్థల ఒత్తిడి?

రాయిటర్స్‌ కథనం ప్రకారం మార్చి 19న FSSAI – ఆహార పరిశ్రమ ప్రతినిధుల మధ్య జరిగిన సమావేశంలో ప్యాకెట్ల ముందు భాగంలో హెచ్చరికలపై కంపెనీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అలాంటి చిహ్నాలు వినియోగదారులకు గందరగోళం కలిగించవచ్చని – పరిమాణ నియంత్రణపై దృష్టి పెట్టాలని పరిశ్రమ ప్రతినిధులు వాదించినట్లు సమావేశ రికార్డులను ఉటంకిస్తూ రాయిటర్స్‌ తెలిపింది.

అయితే ఇదే కంపెనీల్లో కొన్ని విదేశీ మార్కెట్లలో రంగుల ఆధారిత పోషక హెచ్చరికలను స్వచ్ఛందంగా ఉపయోగిస్తున్నాయని రాయిటర్స్‌ పేర్కొంది. దీంతో భారత్‌లో మాత్రం వేరే విధానం ఎందుకు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

భారత్‌ – విదేశాల్లో ఒకే ఉత్పత్తికి తేడా

భారత్‌లో విక్రయించే ఫాంటా పానీయంలో బ్రిటన్‌లో విక్రయించే అదే బ్రాండ్‌ ఉత్పత్తి కంటే చక్కెర పరిమాణం ఎక్కువగా ఉందని రాయిటర్స్‌ నివేదించింది. భారత ఉత్పత్తిలో ఉపయోగించే కృత్రిమ రంగుపై ప్యాకెట్‌ వెనుక చిన్న అక్షరాల్లో సమాచారం ఉండగా – బ్రిటన్‌లో అదే రంగు వినియోగంపై స్పష్టమైన హెచ్చరికలు ఉంటాయని తెలిపింది.

అలాగే భారత్‌లో విక్రయించే కొన్ని మ్యాగీ ఉత్పత్తుల్లో పామాయిల్‌ వినియోగం ఉండగా – బ్రిటన్‌లోని కొన్ని వేరియంట్లలో సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ఉపయోగిస్తున్నట్లు రాయిటర్స్‌ పేర్కొంది. కిట్‌క్యాట్‌ ఉత్పత్తుల్లోనూ దేశాల మధ్య కోకో శాతంలో తేడాలు ఉన్నట్లు తెలిపింది.

మారుతున్న వినియోగదారుల అభిప్రాయం

భారత్‌లో ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ – బెవరేజెస్‌ మార్కెట్‌ భారీగా పెరుగుతున్న సమయంలో ఆరోగ్యంపై అవగాహన కూడా పెరుగుతోంది. సోషల్‌ మీడియా ఫుడ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు – ఆరోగ్య కార్యకర్తలు ఉత్పత్తుల్లోని చక్కెర, ఉప్పు, కృత్రిమ పదార్థాలు – వివిధ దేశాల్లో ఒకే ఉత్పత్తికి ఉండే తేడాలపై ప్రచారం చేస్తున్నారు.

ముందున్నది కీలక నిర్ణయం

ప్యాకెట్‌పై కేవలం పోషక విలువల పట్టిక సరిపోతుందా? లేక ‘అధిక చక్కెర – అధిక ఉప్పు – అధిక సంతృప్త కొవ్వు’ అంటూ వినియోగదారుడికి నేరుగా హెచ్చరిక ఇవ్వాలా? అన్నదే ఇప్పుడు కీలక ప్రశ్నగా మారింది.

సుప్రీంకోర్టు జోక్యంతో ఈ అంశంపై కేంద్రం – FSSAI తదుపరి నిర్ణయం కీలకం కానుంది. కొత్త లేబులింగ్‌ నిబంధనలు అమల్లోకి వస్తే దేశంలోని ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ పరిశ్రమపై మాత్రమే కాకుండా వినియోగదారులు ఉత్పత్తులను ఎంచుకునే విధానంపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!