📄 ePaper
Sunday, August 16, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పదవుల పండుగకు ముహూర్తం..!

పదవుల పండుగకు ముహూర్తం..!

కాంగ్రెస్‌లో నామినేటెడ్ కసరత్తు షురూ.. జిల్లాలకు సంకేతాలు.. జీహెచ్‌ఎంసీ, స్థానిక ఎన్నికలే అసలు టార్గెట్టా?

గాంధీభవన్‌లో మరోసారి నామినేటెడ్ పదవుల చర్చ ఊపందుకుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కాంగ్రెస్ అధిష్ఠానం అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. జిల్లాల వారీగా అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రులకు పార్టీ నుంచి సంకేతాలు వెళ్లినట్లు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆయా జిల్లాల నుంచి వచ్చే ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పరిశీలించిన అనంతరం తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.

ఈ విడతలో రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, కమిషన్లు, బోర్డులతో పాటు జిల్లా, మండల స్థాయిలోని నామినేటెడ్ పదవులను కూడా ఒకేసారి భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ కోసం ఎన్నికల నుంచి ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో పనిచేసిన నాయకులు, ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో చురుకుగా పనిచేసిన కార్యకర్తలకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

యువ నాయకత్వానికి కూడా ఈసారి కాంగ్రెస్ పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. యూత్ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ, సేవాదళ్‌తో పాటు గ్రామ, మండల స్థాయిలో పార్టీని బలోపేతం చేసిన యువ కార్యకర్తలకు జిల్లా, మండల స్థాయి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించే దిశగా కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న యువ నాయకుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

మండల స్థాయిలో సహకార సంఘాలు, ఇతర స్థానిక సంస్థల్లోని నామినేటెడ్ పదవుల భర్తీపై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆశావహుల దృష్టి గాంధీభవన్‌పై నిలిచింది.

కేడర్‌లో జోష్ నింపే వ్యూహమా?

నామినేటెడ్ పదవుల భర్తీ వెనుక రాజకీయ వ్యూహం కూడా ఉందనే చర్చ సాగుతోంది. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగే ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని క్షేత్రస్థాయి కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు కాంగ్రెస్ ఈ ప్రక్రియను వేగవంతం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పదవుల ద్వారా కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడంతో పాటు ఎన్నికల నాటికి పార్టీ యంత్రాంగాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ వ్యూహం వెనుక ఉద్దేశమని చెబుతున్నారు.

అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ లేదా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ గాంధీభవన్‌లో ఆశావహుల సందడి రోజురోజుకూ పెరుగుతుండగా, జిల్లాల నుంచి జాబితాల సేకరణపై చర్చలు ఊపందుకున్నాయి. ఈ విడతలో ఎవరికి అవకాశం దక్కుతుందనే ఉత్కంఠ కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొంది.

© 2026 నవజ్యోతి తెలుగు దినపత్రిక. అన్ని హక్కులు ప్రత్యేకించబడినవి.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!