మండల స్థాయిలో వికేంద్రీకరణ.. ప్రజలకు చేరువగా ఫిర్యాదుల పరిష్కారం…
ప్రజల సమస్యల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేసి, ప్రభుత్వ సేవలను స్థానిక స్థాయిలోనే అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయిలో మరింత వ్యవస్థీకృతంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్లానింగ్ (వి) శాఖ జీఓ ఎంఎస్ నెం.4ను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి.
ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నారు. ఎంపీడీవోను నోడల్ అధికారిగా నియమించగా, తహసీల్దార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులను స్వీకరించి చర్యలు చేపట్టనున్నారు.
ప్రజావాణి ముఖ్యాంశాలు
• ప్రతి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి నిర్వహణ.
• అన్ని శాఖల అధికారులు ఒకే వేదికపై ప్రజల వినతుల స్వీకరణ.
• ప్రతి ఫిర్యాదుకు గ్రీవెన్స్ ఐడీతో కూడిన రసీదు.
• ప్రతి మండలంలో కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్ సౌకర్యాలతో ప్రత్యేక నమోదు కేంద్రం.
• వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, చిన్నారులతో వచ్చే మహిళలకు ప్రాధాన్యం.
వికేంద్రీకరణతో వేగవంతమైన పరిష్కారం. .
గతంలో ప్రజావాణి ప్రధానంగా తహసీల్దార్ కార్యాలయాలకే పరిమితమైంది. ఇప్పుడు ఎంపీడీవో కార్యాలయాన్ని కేంద్రంగా తీసుకుని అన్ని శాఖల అధికారులను ఒకే వేదికపైకి తీసుకురావడంతో ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే తమ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం లభించనుంది. శాఖల మధ్య సమన్వయం పెరిగి ఫిర్యాదుల పరిష్కారం మరింత వేగవంతం అవుతుందని అధికారులు భావిస్తున్నారు.
దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు అవసరం…
ఈ వ్యవస్థను వ్యక్తిగత కక్షలు లేదా నిరాధార ఆరోపణల కోసం దుర్వినియోగం చేసే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రతి ఫిర్యాదును అధికారులు నిష్పక్షపాతంగా పరిశీలించి వాస్తవాలను నిర్ధారించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.అయితే ఈ వ్యవస్థను వ్యక్తిగత కక్షలు లేదా నిరాధార ఫిర్యాదుల కోసం కొందరు దుర్వినియోగం చేసే అవకాశాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఒకే అంశంపై నిర్ణీత గడువు పూర్తికాకముందే ఫిర్యాదుదారులు పలుమార్లు కార్యాలయాలకు వెళ్లి అధికారులపై అనవసర ఒత్తిడి తీసుకురావడం, రోజువారీ పరిపాలనా పనులకు ఆటంకం కలిగించడం వంటి పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయని చెబుతున్నారు. దీంతో ప్రజల ఫిర్యాదులు సకాలంలో పరిష్కారం కావడంతో పాటు అధికారుల పనితీరుకు ఆటంకం కలగకుండా స్పష్టమైన గడువులు, పర్యవేక్షణ విధానం, నిరాధార ఫిర్యాదులపై చర్యలు వంటి అంశాలతో ప్రజావాణి వ్యవస్థలో ప్రక్షాళన అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

