విద్యార్థుల డిజిటల్ విద్యకు ముదిరాజ్ యూత్ చేయూత
రామాయంపేట, ఆగస్టు 25 (నవజ్యోతి ప్రతినిధి రాజాగౌడ్): కాట్రియాల్ ఎంపీపీఎస్ పాఠశాల విద్యార్థుల డిజిటల్ విద్యాభ్యాసానికి ముదిరాజ్ యూత్ సభ్యులు చేయూతనందించారు. ఏఎక్స్ఎల్ కంప్యూటర్ క్లాసులకు అవసరమైన మైక్రోఫోన్ హెడ్సెట్లు లేక గత 15 రోజులుగా తరగతులు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయ బృందం ముదిరాజ్ యూత్ సభ్యుల దృష్టికి తీసుకెళ్లింది.
రూ.5 వేల విలువైన పరికరాల అందజేత
స్పందించిన ముదిరాజ్ యూత్ సభ్యులు మూడు కంప్యూటర్లకు అవసరమైన మూడు మైక్రోఫోన్ హెడ్సెట్లను సుమారు రూ.5 వేల విలువతో అందించారు. దీంతో పాఠశాలలో ఏఎక్స్ఎల్ కంప్యూటర్ క్లాసులు తిరిగి ప్రారంభమయ్యాయి. విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకునేందుకు ఈ సహాయం ఎంతో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.
పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని స్పందించి విలువైన పరికరాలను అందించిన ముదిరాజ్ యూత్ దాతలకు పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

