📄 ePaper
Wednesday, September 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్కామారెడ్డి టు కొంపల్లి.. రూ.19 లక్షల డ్రగ్స్ రూట్‌కు చెక్!

కామారెడ్డి టు కొంపల్లి.. రూ.19 లక్షల డ్రగ్స్ రూట్‌కు చెక్!

1.9 కిలోల అల్ప్రాజోలం.. జయభేరి పార్క్ వద్ద డీల్‌కు రెడీగా ఉండగా పోలీసుల వల
కుత్బుల్లాపూర్, సెప్టెంబర్‌ 2 (నవజ్యోతి ప్రతినిధి):కామారెడ్డి నుంచి కొంపల్లి వరకు సాగుతున్న అల్ప్రాజోలం సరఫరా మార్గానికి పోలీసులు చెక్ పెట్టారు. పెట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొంపల్లి జయభేరి పార్క్‌ వద్ద రూ.19 లక్షల విలువైన 1.9 కిలోల అల్ప్రాజోలం విక్రయానికి సిద్ధంగా ఉండగా పెట్‌బషీరాబాద్‌ పోలీసులు, కుత్బుల్లాపూర్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.

స్వాధీనం చేసుకున్నవి

నిందితుల వద్ద నుంచి 1.9 కిలోల అల్ప్రాజోలం, సుజుకి బ్రెజ్జా కారు, హీరో గ్లామర్‌ బైక్‌, రూ.40 వేల నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

జయభేరి పార్క్‌ వద్ద డీల్‌..

ఆగస్టు 31న జయభేరి పార్క్‌ పరిసరాల్లో డ్రగ్స్‌ డీల్‌ జరగనున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అక్కడికి వచ్చిన సంధిల కృష్ణ, కుమ్మరి సాయి, కూచి విశ్వనాథంను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా.. విశ్వనాథం వద్ద ఉన్న బ్యాగులో నాలుగు ప్యాకెట్లలో 1.9 కిలోల అల్ప్రాజోలం బయటపడింది.

కామారెడ్డి నుంచి కొంపల్లికి..

ముగ్గురిని విచారించగా డ్రగ్స్‌ సరఫరా వెనుక గొల్ల రమేష్‌, నాతి చంద్ర గౌడ్‌ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సాంకేతిక ఆధారాలతో కామారెడ్డిలో ఉన్న వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన ఐదుగురూ కామారెడ్డి జిల్లాకు చెందినవారేనని పోలీసులు తెలిపారు.

దీంతో కామారెడ్డి నుంచి హైదరాబాద్‌ శివార్ల వరకు సాగుతున్న సరఫరా లింక్‌పై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

రూ.40 వేల అడ్వాన్స్‌..

అల్ప్రాజోలం కొనుగోలు, సరఫరా కోసం రూ.40 వేల అడ్వాన్స్‌ చెల్లించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. డ్రగ్‌ను కామారెడ్డి నుంచి కొంపల్లికి తీసుకొచ్చి అధిక ధరకు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మాజీ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌.. మళ్లీ డ్రగ్స్‌ కేసులో

కేసులో A1గా ఉన్న గొల్ల రమేష్‌ గతంలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌గా పనిచేసిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతనిపై గతంలోనూ అల్ప్రాజోలం కేసు నమోదైనట్లు కోర్టు రికార్డుల్లో ఉన్నట్లు సమాచారం.

2023లో శాద్నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సుమారు 2 కిలోల అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్న కేసులో రమేష్‌ పేరు నమోదైనట్లు పేర్కొంటున్నారు. ఆ కేసులో అల్ప్రాజోలం కమర్షియల్‌ క్వాంటిటీగా పరిగణించబడింది. గత కేసుకు, ప్రస్తుత కేసుకు మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

పాత లింకులా.. కొత్త నెట్‌వర్కా?

ప్రస్తుత కేసులో పట్టుబడిన డ్రగ్‌ వెనుక ఉన్న సరఫరా గొలుసును పోలీసులు ఛేదించే పనిలో ఉన్నారు. నిందితుల మొబైల్‌ ఫోన్లు, కాల్‌ వివరాలు, నగదు లావాదేవీలు, వాహనాల కదలికలను పరిశీలిస్తున్నారు. కామారెడ్డి నుంచి కొంపల్లి వరకు ఈ డ్రగ్‌ ప్రయాణంలో ఇంకా ఎవరెవరు ఉన్నారు? కొంపల్లిలో డ్రగ్‌ ఎవరికి చేరాల్సి ఉంది? గత నెట్‌వర్క్‌తో ప్రస్తుత లింకులకు సంబంధం ఉందా? అనే కోణాల్లో దర్యాప్తు సాగుతోంది.

డీల్‌కు ముందే పోలీసుల వల

కామారెడ్డి నుంచి బయలుదేరిన 1.9 కిలోల అల్ప్రాజోలం కొంపల్లిలో డీల్‌కు చేరకముందే పోలీసుల వలలో చిక్కింది. అయితే ఈ ఒక్క పట్టివేతతో సరఫరా గొలుసు ముగిసిందా.. లేక దీని వెనుక మరింత పెద్ద నెట్‌వర్క్‌ ఉందా అనేది పోలీసుల తదుపరి దర్యాప్తులో తేలనుంది.

కేసు హైలైట్స్‌: 1.9 కిలోల అల్ప్రాజోలం • విలువ రూ.19 లక్షలు • ఐదుగురు అరెస్ట్‌ • రూ.40 వేల నగదు • కారు, బైక్‌, సెల్‌ఫోన్లు స్వాధీనం
RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!