📄 ePaper
Wednesday, September 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పోలవరం : మలేరియా మాత్రల కలకలం.. ఇద్దరు విద్యార్థుల మృతి?

పోలవరం : మలేరియా మాత్రల కలకలం.. ఇద్దరు విద్యార్థుల మృతి?

73 మందికి క్లోరోక్విన్‌ పంపిణీ.. సుమారు 20 మందికి అస్వస్థత
భద్రాచలం, సెప్టెంబర్‌ 2 (నవజ్యోతి ప్రతినిధి):
ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం జిల్లా ఎటపాక మండలం విసాపురం గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లగుప్పలో విద్యార్థులకు క్లోరోక్విన్‌ మాత్రలు పంపిణీ చేసిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పాఠశాలలో 73 మంది విద్యార్థులకు మాత్రలు ఇచ్చినట్లు సమాచారం. వాటిని తీసుకున్న కొద్దిసేపటికే సుమారు 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు స్థానిక సమాచారం.

వాంతులు.. కళ్లు తిరగడం.. ఆసుపత్రికి తరలింపు

క్లోరోక్విన్‌ మాత్రలు తీసుకున్న అనంతరం విద్యార్థుల్లో వాంతులు, వికారం, కళ్లు తిరగడం, స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను చికిత్స కోసం తెలంగాణలోని భద్రాచలం ప్రాంత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.

ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు సమాచారం

ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందినట్లు స్థానికంగా సమాచారం అందుతోంది. అయితే మృతుల సంఖ్య, వారి పూర్తి వివరాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

మలేరియా నివారణలో భాగంగానే మాత్రల పంపిణీ?

ఇటీవల ప్రాంతంలో మలేరియా జ్వరంతో ఓ యువతి మృతి చెందిన నేపథ్యంలో వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు వైద్య సిబ్బంది గ్రామాన్ని సందర్శించి పరీక్షలు నిర్వహించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు క్లోరోక్విన్‌ మాత్రలు పంపిణీ చేసినట్లు సమాచారం.

మాత్రలు వేసుకున్నాకే అస్వస్థత

మృతి చెందిన విద్యార్థి బంధువు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత బాలికకు కళ్లు తిరుగుతున్నాయని చెప్పిందన్నారు. కొద్దిసేపటికే స్పృహ కోల్పోయిందని, మాట కూడా రాకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లామని తెలిపారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు.

గడువు ముగిసిన మందులా?

విద్యార్థులకు పంపిణీ చేసిన క్లోరోక్విన్‌ మాత్రలు గడువు ముగిసినవేనన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక నిర్ధారణ లేదు. మందుల ప్యాకెట్‌, బ్యాచ్‌ నంబర్‌, తయారీ తేదీ, గడువు తేదీ, మందుల నమూనాల పరీక్ష వంటి అంశాలను అధికారులు పరిశీలించాల్సి ఉంది.

కీలక ప్రశ్నలు

73 మంది విద్యార్థులకు ఒకేసారి మందులు ఎందుకు ఇచ్చారు? • మందుల బ్యాచ్‌ నంబర్‌ ఏమిటి? • గడువు తేదీ ముగిసిందా? • మందులు ఎక్కడి నుంచి సరఫరా అయ్యాయి? • ఎంత మోతాదులో ఇచ్చారు? • విద్యార్థుల అస్వస్థతకు అసలు కారణం ఏమిటి?

కారణం తేలాల్సి ఉంది

విద్యార్థులు క్లోరోక్విన్‌ మాత్రలు తీసుకున్న అనంతరం అస్వస్థతకు గురయ్యారన్న విషయం ఆందోళన కలిగిస్తోంది. అయితే మరణాలకు క్లోరోక్విన్‌ మాత్రలే కారణమని ప్రస్తుతం నిర్ధారించలేం. మందుల నమూనాల పరీక్ష, వైద్యుల నివేదికలు, అవసరమైతే పోస్టుమార్టం నివేదిక, అధికారుల విచారణ ఆధారంగానే అసలు కారణం తేలనుంది.

పూర్తి విచారణకు డిమాండ్

విద్యార్థులకు పంపిణీ చేసిన మందుల బ్యాచ్‌, గడువు తేదీ, సరఫరా విధానం, పంపిణీ చేసిన సిబ్బంది వివరాలను అధికారులు వెంటనే పరిశీలించి ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!