📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్హనీట్రాప్‌లో చిక్కిన వింగ్‌ కమాండర్‌.. రక్షణ రహస్యాల లీక్‌ ఆరోపణలు !

హనీట్రాప్‌లో చిక్కిన వింగ్‌ కమాండర్‌.. రక్షణ రహస్యాల లీక్‌ ఆరోపణలు !

పాకిస్థాన్‌ నిఘా వర్గాలతో సంబంధాలున్న మహిళతో సోషల్‌ మీడియా పరిచయం.. పెద్ద గూఢచర్య నెట్‌వర్క్‌పై దర్యాప్తు

న్యూఢిల్లీ, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి): భారత వైమానిక దళానికి చెందిన ఓ వింగ్‌ కమాండర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్థాన్‌ నిఘా వర్గాలతో సంబంధాలున్నట్లు అనుమానిస్తున్న ఓ మహిళ సోషల్‌ మీడియా ద్వారా అతడిని హనీట్రాప్‌లోకి దింపి, సున్నితమైన రక్షణ సమాచారాన్ని సేకరించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో మరింత పెద్ద గూఢచర్య నెట్‌వర్క్‌ ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

పోలీసుల వివరాల ప్రకారం.. వ్యక్తిగత సమస్యలతో ఉన్నట్లు భావిస్తున్న వింగ్‌ కమాండర్‌కు ఈ ఏడాది ప్రారంభంలో సోషల్‌ మీడియా ద్వారా ఓ మహిళ పరిచయమైంది. కొంతకాలం మెసేజ్‌లు, ఫోన్‌ సంభాషణల ద్వారా అతడి నమ్మకాన్ని పొందిన అనంతరం రక్షణ వ్యవస్థకు సంబంధించిన గోప్యమైన పత్రాలు, సమాచారాన్ని ఫొటోలు, వీడియోల రూపంలో పంపేలా ప్రేరేపించినట్లు అధికారులు చెబుతున్నారు.

స్పైవేర్‌ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయాలని ఒత్తిడి

అంతేకాకుండా మరో రక్షణ సిబ్బంది మొబైల్‌ ఫోన్‌లో ఓ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయాలని కూడా అతడిని కోరినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు. ఆ యాప్‌ స్పైవేర్‌ లేదా రిమోట్‌ యాక్సెస్‌ మాల్‌వేర్‌గా పనిచేసి ఫోన్‌లోని సమాచారాన్ని దొంగిలించడంతో పాటు దాని లొకేషన్‌ను ట్రాక్‌ చేసే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.

ఐఏఎఫ్‌ నిఘాతో వెలుగులోకి

వింగ్‌ కమాండర్‌ కార్యకలాపాలపై ఐఏఎఫ్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికి ఎలక్ట్రానిక్‌ నిఘా ద్వారా సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. సేకరించిన ఆధారాలను ఢిల్లీ పోలీసుల స్పెషల్‌ సెల్‌కు అందించడంతో తదుపరి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మే 31 రాత్రి అతడిని అదుపులోకి తీసుకుని, ప్రత్యేక దర్యాప్తు బృందాలు, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా విచారించినట్లు సమాచారం. అనంతరం కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీకి పంపగా ప్రస్తుతం తీహార్‌ జైలులో ఉన్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి.

ఛార్జ్‌షీట్‌ దాఖలు

ఈ కేసులో ఢిల్లీ పోలీసులు జూలై 30న సంబంధిత కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. వింగ్‌ కమాండర్‌పై అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదైనట్లు సమాచారం. అయితే ఆయన పేరును పోలీసులు బహిర్గతం చేయలేదు.

ఒక్క అధికారితోనే పరిమితమా?

ఈ వ్యవహారం కేవలం ఒక వింగ్‌ కమాండర్‌ నుంచి సమాచారం సేకరించడానికే పరిమితమైందా? లేక ఇతర రక్షణ సిబ్బంది మొబైల్‌ ఫోన్లు, సమాచారాన్ని కూడా చేరుకోవడానికి ప్రయత్నించారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. మహిళ వెనుక పెద్ద గూఢచర్య నెట్‌వర్క్‌ ఉండే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు.

భారత రక్షణ వ్యవస్థకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని సోషల్‌ ఇంజినీరింగ్‌, నకిలీ పరిచయాలు, హనీట్రాప్‌ల ద్వారా సేకరించే ప్రయత్నాలు భద్రతా సంస్థలకు కొత్త సవాల్‌గా మారుతున్నాయి. ఈ కేసులో వింగ్‌ కమాండర్‌ నుంచి ఖచ్చితంగా ఏ సమాచారం బయటకు వెళ్లింది, దాన్ని ఎవరికి చేరవేశారు, మరెవరైనా ఇందులో భాగస్వాములయ్యారా అనే అంశాలపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!