బొగ్గు, నకిలీ బంగారు నాణేలు పాతిపెట్టి నమ్మించిన ముఠా.. 11 మంది బాధితులు
హైదరాబాద్, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి):
గుప్త నిధుల పేరుతో ప్రజలను నమ్మించి దాదాపు రూ.కోటి మోసానికి పాల్పడిన ముఠాను హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. 11 మందిని మోసం చేసిన ఈ కేసులో నలుగురిని కమిషనర్ టాస్క్‌ఫోర్స్ షామీర్‌పేట జోన్ పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులతో కలిసి అరెస్టు చేశారు.
గుడిమల్కాపూర్‌కు చెందిన కార్ డెంటింగ్, పెయింటింగ్ కార్మికుడు మహ్మద్ మునావర్ అలియాస్ మున్నాను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. సయ్యద్ అలీ అష్రఫ్, మహ్మద్ హాజీ, మహ్మద్ సల్మాన్ అతని సహచరులుగా పేర్కొన్నారు.
ఇళ్లలో గుప్త నిధులు ఉన్నాయని, వాటిని గుర్తించే ప్రత్యేక పరిజ్ఞానం తమకు ఉందని నిందితులు బాధితులను నమ్మించేవారు. అనంతరం లక్ష్యంగా చేసుకున్న ప్రదేశంలో తవ్వకాలు జరిపి బొగ్గు, నకిలీ బంగారు పూత నాణేలు ఉన్న సంచిని ముందుగానే పాతిపెట్టేవారు. వాటిని చూపించి గుప్త నిధులు బయటపడ్డాయని నమ్మించేవారు.
బొగ్గు కొంతకాలానికి బంగారంగా మారుతుందని చెప్పి బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసి అక్కడి నుంచి పరారయ్యేవారు. ఇలా 11 మందిని మోసం చేసి సుమారు రూ.కోటి కొల్లగొట్టినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుల నుంచి రెండు కార్లు, ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్‌ఫోన్లు, 25 నకిలీ బంగారు నాణేలు, 6 కిలోల బొగ్గు, 4 కిలోల మట్టి, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మునావర్‌పై గతంలో బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌లోనూ మోసం కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో బీఎన్‌ఎస్ 318(4), 351(2), 61(2)తో పాటు 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుప్త నిధుల పేరుతో ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మవద్దని, ఇలాంటి మోసాలపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు.

