📄 ePaper
Tuesday, August 11, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తెలుగు మహిళలను ‘ఎర’గా వాడుకుని లోన్‌ మోసాలు !

తెలుగు మహిళలను ‘ఎర’గా వాడుకుని లోన్‌ మోసాలు !

ఢిల్లీలో నకిలీ కాల్‌ సెంటర్లపై టీజీసీఎస్‌బీ దాడులు.. 21 మంది మహిళా టెలీకాలర్ల అరెస్ట్‌..

హైదరాబాద్‌, ఆగస్టు 10 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణకు చెందిన తెలుగు మాట్లాడే మహిళలను టెలీకాలర్లుగా నియమించి ఢిల్లీ కేంద్రంగా నకిలీ లోన్‌ కాల్‌ సెంటర్లను నిర్వహిస్తున్న ముఠాను తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) పట్టుకుంది. ఢిల్లీలోని శివా మార్కెట్‌లో మూడు నకిలీ కాల్‌ సెంటర్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించి 21 మంది మహిళా టెలీకాలర్లతో పాటు ఓ బ్యాంకు ఖాతాదారుడిని అదుపులోకి తీసుకుంది. ముఠాకు కీలకంగా వ్యవహరించిన ముగ్గురు నిర్వాహకులు పరారీలో ఉన్నారు.

లోన్‌ పేరుతో నమ్మించి మోసం

బజాజ్‌ ఫైనాన్స్‌ ప్రతినిధులుగా పరిచయం చేసుకుని తెలంగాణలోని బాధితులకు ఆకర్షణీయమైన రుణాలు ఇప్పిస్తామంటూ నిందితులు ఫోన్లు చేసేవారని టీజీసీఎస్‌బీ తెలిపింది. తెలుగు మాట్లాడే మహిళలతో ఫోన్లు చేయించడం ద్వారా బాధితుల నమ్మకాన్ని పొందేవారని పేర్కొంది. రుణం మంజూరు చేయాలంటూ ప్రాసెసింగ్‌, వెరిఫికేషన్‌, డాక్యుమెంటేషన్‌, ఇన్సూరెన్స్‌ తదితర పేర్లతో డబ్బులు వసూలు చేసేవారని తెలిపింది.

మరిన్ని చార్జీల పేరుతో వసూళ్లు

డబ్బులు చెల్లించిన తర్వాత రుణం మంజూరు కాకపోగా, మరిన్ని చార్జీల పేరుతో మళ్లీ డబ్బులు డిమాండ్‌ చేసేవారని అధికారులు గుర్తించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు కోరితే చట్టపరమైన చర్యలు, పరువు నష్టం, వ్యక్తిగత సమాచారం, గుర్తింపు పత్రాల దుర్వినియోగం చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్లు తెలిపారు.

22 సైబర్‌ కేసులతో సంబంధాలు

దాదాపు ఏడాదిన్నరగా ఈ మోసం సాగుతున్నట్లు టీజీసీఎస్‌బీ వెల్లడించింది. అరెస్టయిన 21 మంది మహిళల వయసు 20 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండగా, వారంతా తెలంగాణకు చెందినవారేనని తెలిపింది. జగిత్యాల జిల్లా కోరుట్ల, హైదరాబాద్‌లోని సైదాబాద్‌, బోరబండ, మహబూబ్‌నగర్‌ ప్రాంతాలకు చెందిన పలువురు ఉన్నట్లు పేర్కొంది.

దాడుల్లో 23 మొబైల్‌ ఫోన్లు, రెండు బ్యాంకు పాస్‌బుక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాకు తెలంగాణలోని 22 సైబర్‌ క్రైమ్‌ కేసులతో సంబంధాలు ఉన్నట్లు ఇప్పటివరకు గుర్తించారు. ప్రధాన నిర్వాహకులైన లలిత్‌ సింగ్‌, కుల్దీప్‌ సింగ్‌, అనిల్‌ పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

లోన్‌ ఆఫర్లపై అప్రమత్తంగా ఉండాలి

అనుకోకుండా వచ్చే లోన్‌ ఆఫర్లను నమ్మి ముందుగా ఎలాంటి చార్జీలు చెల్లించవద్దని టీజీసీఎస్‌బీ సూచించింది. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్‌ చేయాలని కోరింది.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!