నిలిపి ఉంచిన లారీని ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్
ఏలూరు, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం గ్రామ సమీపంలోని గ్రీన్‌ఫీల్డ్ హైవేపై బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ఇంటర్‌సిటీ స్మార్ట్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హైవేపై నిలిపి ఉంచిన లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
ప్రమాద ధాటికి బస్సు ముందు భాగం తీవ్రంగా దెబ్బతినడంతో డ్రైవర్ క్యాబిన్‌లో చిక్కుకుపోయాడు. సమాచారం అందుకున్న జంగారెడ్డిగూడెం, లక్కవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్‌ను క్యాబిన్ నుంచి సురక్షితంగా బయటకు తీసి చికిత్స కోసం తరలించారు.
గాయపడిన ప్రయాణికులను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిలిపి ఉంచిన లారీని బస్సు ఢీకొట్టిన పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్నారు.

