📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణకు మెరుగైన ఫలితాలు !

సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణకు మెరుగైన ఫలితాలు !

డిజిటల్ అరెస్ట్ మోసాలు 60% తగ్గింపు.. ఫిర్యాదులను ఎఫ్‌ఐఆర్‌లుగా మార్చడంలో దేశంలోనే తొలి స్థానం..

తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణలో గణనీయమైన పురోగతి నమోదైంది. జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్‌సీఆర్‌పీ) విడుదల చేసిన 2026 జనవరి–జూన్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో డిజిటల్ అరెస్ట్ మోసాల కేసులు 60 శాతం తగ్గాయి. అలాగే సైబర్ నేరాల ఫిర్యాదులను ఎఫ్‌ఐఆర్‌లుగా నమోదు చేయడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.

దేశవ్యాప్తంగా పరిస్థితి.. తెలంగాణ స్థానం…

దేశవ్యాప్తంగా తొలి ఆరు నెలల్లో 12.71 లక్షల సైబర్ నేరాల ఫిర్యాదులు నమోదు కాగా, బాధితులు రూ.9,594 కోట్ల మేర నష్టపోయారు. తెలంగాణలో 45,080 ఫిర్యాదులు నమోదై రూ.616 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లింది. మొత్తం ఫిర్యాదుల్లో రాష్ట్ర వాటా 3.5 శాతంగా ఉండగా, ఫిర్యాదుల సంఖ్యలో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. ఆర్థిక నష్టాల పరంగా ఆరో స్థానంలో ఉన్నప్పటికీ గతంతో పోలిస్తే పరిస్థితి మెరుగుపడినట్లు నివేదిక వెల్లడించింది.

ఎఫ్‌ఐఆర్ నమోదు విషయంలో తెలంగాణ అగ్రస్థానం…

సైబర్ నేరాల ఫిర్యాదులను ఎఫ్‌ఐఆర్‌లుగా మార్చడంలో తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరిచింది. దేశ సగటు 1.56 శాతం ఉండగా, తెలంగాణలో ఈ మార్పిడి శాతం 16.56 శాతంగా నమోదైంది. దీంతో నేరస్థులను గుర్తించడం, అరెస్టు చేయడం, అంతర్రాష్ట్ర ముఠాలను ఛేదించడం మరింత వేగవంతమైందని అధికారులు తెలిపారు.

డిజిటల్ అరెస్ట్, పెట్టుబడి మోసాల్లో తగ్గుదల..

అంశం 2024 2025 2026 (జనవరి–జూన్)
డిజిటల్ అరెస్ట్ కేసులు 3,037 1,270 449
పెట్టుబడి మోసాల కేసులు 23,033 22,340 6,738

డిజిటల్ అరెస్ట్ మోసాల్లో ఆర్థిక నష్టం కూడా 47 శాతం తగ్గినట్లు నివేదిక వెల్లడించింది. పెట్టుబడి మోసాల కేసులు 3 శాతం తగ్గగా, బాధితుల ఆర్థిక నష్టం 19 శాతం మేర తగ్గింది.

నిధుల రక్షణలోనూ పురోగతి

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్‌బీ) సత్వర చర్యలతో మోసగాళ్లు డబ్బు ఉపసంహరించుకునే ముందు నిలిపివేస్తున్న నిధుల శాతం పెరిగింది. 2025 ద్వితీయార్థంలో ఇది 18 శాతం ఉండగా, 2026 తొలి ఆరు నెలల్లో 28 శాతానికి చేరింది.

ఏఐ సాంకేతికతతో వేగవంతమైన చర్యలు

కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ, వేగవంతమైన ఎఫ్‌ఐఆర్ నమోదు, అంతర్రాష్ట్ర సమన్వయం, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, పోలీసుల తక్షణ స్పందన వల్లే సైబర్ నేరాల తగ్గుదల సాధ్యమైందని అధికారులు తెలిపారు. 2024లో నమోదైన 93,930 సైబర్ ఫిర్యాదులు 2025లో 91,369కు తగ్గగా, ఆర్థిక నష్టం రూ.1,909.55 కోట్ల నుంచి రూ.1,524.76 కోట్లకు తగ్గినట్లు నివేదిక పేర్కొంది.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!