సీఈఐఆర్ వేదికగా కామారెడ్డి పోలీసుల దూకుడు.. ఇప్పటివరకు 5,275 ఫోన్లు రికవరీ..
కామారెడ్డి, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి):
మొబైల్ ఫోన్ పోయిందంటే ఇక దొరకదనే ఆందోళన అవసరం లేదని కామారెడ్డి పోలీసులు నిరూపిస్తున్నారు. సీఈఐఆర్ పోర్టల్, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించి బాధితులకు అప్పగిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లాలో ఏకంగా 5,275 మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి రికవరీ చేసినట్లు ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు.
ఈ ఏడాది ఇప్పటివరకు రూ.1.59 కోట్ల విలువైన 994 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో కేవలం 20 రోజుల్లోనే రూ.32 లక్షల విలువైన 200 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. సీఈఐఆర్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి రికవరీ చేసిన ఫోన్ల మొత్తం విలువ సుమారు రూ.8.44 కోట్లుగా ఉంది.
ఇన్‌స్పెక్టర్ సంపత్ పర్యవేక్షణలో ఆర్ఎస్‌ఐ బాలరాజు, ఐదుగురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం నెలకు సగటున 150కుపైగా ఫోన్లను రికవరీ చేస్తోంది. గత ఏడాది కూడా రూ.3 కోట్ల విలువైన 1,834 ఫోన్లను గుర్తించి బాధితులకు అందజేశారు.
ఫోన్ పోయిన వెంటనే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు సిమ్‌ను బ్లాక్ చేయాలని పోలీసులు సూచించారు. అనంతరం సీఈఐఆర్ పోర్టల్‌లో ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్ చేయాలి. పోయిన ఫోన్ ద్వారా సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉన్నందున అనుమానాస్పద కాల్స్, లింకులకు స్పందించవద్దని హెచ్చరించారు.
రికవరీ అయిన ఫోన్లను పొందేందుకు బాధితులు సంబంధిత ధ్రువపత్రాలతో జిల్లా పోలీసు కార్యాలయంలో ఆర్ఎస్‌ఐ బాలరాజు (8712686114)ను సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

