📄 ePaper
Wednesday, August 5, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ఆటోను ఢీకొట్టిన లారీ.. 14 మంది విద్యార్థులకు గాయాలు !

ఆటోను ఢీకొట్టిన లారీ.. 14 మంది విద్యార్థులకు గాయాలు !

ముగ్గురి పరిస్థితి విషమం.. ఆదర్శ పాఠశాలలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఏబీవీపీ డిమాండ్…

మెదక్ జిల్లా రామాయంపేటలోని 44వ జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 14 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు, ఆటో డ్రైవర్ గాయపడ్డారు. వారిలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

రామాయంపేట తెలంగాణ ఆదర్శ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు పాఠశాల ముగిసిన అనంతరం ఆటోలో నిజాంపేట మండలం నస్కల్ గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 44వ జాతీయ రహదారిపై వై జంక్షన్ వద్ద పట్టణంలోకి వెళ్తున్న ఆటోను వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడింది.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం తీవ్రంగా గాయపడిన ముఖేష్, స్తుతి, లావణ్యలను మెరుగైన వైద్యం కోసం సిద్ధిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, మిగిలిన విద్యార్థులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. 44వ జాతీయ రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయాలని ఏబీవీపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!