మేడిపల్లి, ఆగస్టు 21 (నవజ్యోతి ప్రతినిధి):
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఆహార పదార్థాలను కల్తీ చేసి అక్రమ లాభాలకు
పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్
బి. సుమతి హెచ్చరించారు. ప్రజల
ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కల్తీ వ్యాపారం చేసే వారిపై చట్టపరంగా ఉక్కుపాదం
మోపుతామని స్పష్టం చేశారు.
పోలీస్ కమిషనర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎస్‌ఓటీ మల్కాజిగిరి,
ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ బృందాలు గురువారం మెడిపల్లి పోలీస్‌స్టేషన్
పరిధిలోని శ్రీనివాస్‌నగర్ కాలనీలో ఉన్న సాయి తిరుమల ఎంటర్‌ప్రైజెస్‌పై
మెరుపుదాడి నిర్వహించాయి.
కారం పొడిలో 30 శాతం రంపపు పొడి
విశ్వసనీయ సమాచారంతో చేపట్టిన తనిఖీల్లో పసుపు, కారం, ధనియాల పొడి,
గరం మసాలాలను నిర్ణీత ఆహార నాణ్యత, భద్రతా ప్రమాణాలు పాటించకుండా
అపరిశుభ్ర పరిస్థితుల్లో తయారు చేసి ప్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించినట్లు
పోలీసులు తెలిపారు.
ముఖ్యంగా కారం పొడిలో 30 శాతం రంపపు పొడి
(సా డస్ట్) కలిపినట్లు గుర్తించారు. అంతేకాకుండా అసలు బ్రాండ్‌లను
పోలిన నకిలీ ప్యాకింగ్, లేబుళ్లను ఉపయోగించి నాసిరకం ఉత్పత్తులను
నాణ్యమైన బ్రాండెడ్ సరుకులుగా నమ్మించే ప్రయత్నం జరిగినట్లు అధికారులు
గుర్తించారు.
10.89 టన్నుల మసాలా పదార్థాలు స్వాధీనం
దాడిలో భారీగా మసాలా పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
- పసుపు పొడి: 2,300 కిలోలు
- కారం పొడి: 3,350 కిలోలు
- ధనియాల పొడి: 5,140 కిలోలు
- గరం మసాలా: 100 కిలోలు
మొత్తం 10,890 కిలోలు అంటే 10.89 టన్నుల
మసాలా పదార్థాలను స్వాధీనం చేసుకోగా, వీటి అంచనా విలువ సుమారు
రూ.25 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. తయారీ,
ప్యాకింగ్‌కు ఉపయోగిస్తున్న ముడి పదార్థాలు, ప్రాసెస్ చేసిన పొడులు,
ప్యాకింగ్ సామగ్రి, యంత్రాలను కూడా పరిశీలించారు.
ఇద్దరు అదుపులో.. నకిలీ ప్యాకింగ్ గుట్టురట్టు
ఈ వ్యవహారంలో సత్యనారాయణ, రుద్రశేఖర్ అనే ఇద్దరిని పోలీసులు
అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకును మెడిపల్లి పోలీస్‌స్టేషన్‌కు
తరలించారు. ఆహార భద్రత, కల్తీ, మిస్‌బ్రాండింగ్‌తో పాటు ఆహార పదార్థాల
అక్రమ తయారీ, విక్రయాలకు సంబంధించి వర్తించే చట్టాల ప్రకారం తదుపరి చర్యలు
చేపడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి
ప్యాకెట్ ఆకర్షణీయంగా ఉందని, ప్రముఖ బ్రాండ్‌ను పోలిన పేరు ఉందని మాత్రమే
చూసి ఆహార పదార్థాలను కొనుగోలు చేయవద్దని పోలీస్ కమిషనర్ బి. సుమతి
సూచించారు. బ్రాండ్ పేరు, తయారీ తేదీ, గడువు లేదా బెస్ట్ బిఫోర్ తేదీ,
బ్యాచ్ నంబర్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వివరాలు తదితర తప్పనిసరి
సమాచారాన్ని పరిశీలించిన తర్వాతే కొనుగోలు చేయాలని సూచించారు.
ప్యాకింగ్ సరిగా లేకపోయినా, లేబులింగ్‌పై అనుమానం వచ్చినా లేదా నాణ్యతపై
సందేహం కలిగినా అలాంటి ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా సంబంధిత అధికారులకు
సమాచారం అందించాలని కోరారు.
విక్రయాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే 8712662111
నంబర్‌కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.
పోలీసు బృందాలకు అభినందనలు
పోలీస్ కమిషనర్ బి. సుమతి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరిగిన ఈ ఆపరేషన్‌లో
ఉప్పల్ జోన్ డీసీపీ కె. సురేష్ కుమార్, ఎస్‌ఓటీ డీసీపీ కె. మనోహర్,
మెడిపల్లి ఏసీపీ బి. మోహన్ కుమార్, ఎస్‌ఓటీ మల్కాజిగిరి, ఎస్‌ఓటీ ఉప్పల్
జోన్, ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ బృందాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజలకు చేరే ఆహారం స్వచ్ఛంగా, సురక్షితంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని,
ప్రజారోగ్యంతో చెలగాటమాడే ఏ అక్రమ వ్యాపారాన్నీ ఉపేక్షించే ప్రసక్తే లేదని
పోలీస్ కమిషనర్ బి. సుమతి స్పష్టం చేశారు.

