1,604 మంది అభ్యర్థుల ఎంపిక.. ఆగస్టు 17న ధ్రువపత్రాల సమర్పణ..
హైదరాబాద్, ఆగస్టు 3 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) టీజీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల తుది ఎంపిక జాబితాను సోమవారం విడుదల చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 17న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1,743 పోస్టులకు నియామక ప్రక్రియ చేపట్టగా, అర్హులైన అభ్యర్థులు లభించక 139 పోస్టులు ఖాళీగా మిగిలాయి. మొత్తం 1,604 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు మండలి వెల్లడించింది.
డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల్లో ఎంపిక
డ్రైవర్ పోస్టుల్లో 1,000 ఖాళీలకు గాను 894 మంది ఎంపిక కాగా, శ్రామిక్ పోస్టుల్లో 743 ఖాళీలకు గాను 710 మంది ఎంపికయ్యారు. వీరిలో 694 మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ తెలిపింది.
వెబ్‌సైట్‌లో వివరాలు అందుబాటులో
ఎంపికైన అభ్యర్థులు తమ లాగిన్‌లో ఎంపిక వివరాలు, డ్రైవర్ పోస్టులకు సంబంధించిన డ్రైవింగ్ టెస్ట్ మార్కుల షీట్, తుది ఎంపిక జాబితా, కట్‌ఆఫ్ మార్కులను పరిశీలించవచ్చని పేర్కొంది.
ఆగస్టు 17న ధ్రువపత్రాల సమర్పణ
అభ్యర్థుల నియామకం క్యారెక్టర్, యాంటిసిడెంట్స్ వెరిఫికేషన్‌తో పాటు వైద్య పరీక్షల ఫలితాలకు లోబడి ఉంటుందని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ స్పష్టం చేసింది. ఆగస్టు 7 ఉదయం 8 గంటల నుంచి ఆగస్టు 11 అర్ధరాత్రి వరకు అటెస్టేషన్ ఫారాన్ని ఆన్‌లైన్‌లో పూర్తి చేయాలని సూచించింది.
ఆన్‌లైన్‌లో ఫారం పూర్తి చేసిన అనంతరం మూడు ప్రింట్ కాపీలు తీసుకుని, సంతకాలు, పాస్‌పోర్టు సైజు ఫొటోలు, గెజిటెడ్ అధికారి ధ్రువీకరణతో పాటు అవసరమైన ధ్రువపత్రాల ప్రతులను జత చేసి ఆగస్టు 17న సంబంధిత జిల్లా పోలీసు కార్యాలయాల్లో సమర్పించాలని టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు.

