దోమకొండ బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు
కామారెడ్డి, ఆగస్టు 2 (నవజ్యోతి ప్రతినిధి):

కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ మండల కేంద్రంలో ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించిన శ్రీ మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాల్లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ నాయకుడు మహమ్మద్ ఇలియాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక చాముండేశ్వరి దేవి ఆలయానికి చేరుకున్న ఆయన ఆలయ అర్చకుల వేదమంత్రోచ్చారణల మధ్య అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మహమ్మద్ ఇలియాస్ మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగ ప్రజల ఐక్యతకు, భక్తి భావానికి నిదర్శనమని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని, రైతులకు సమృద్ధిగా పంటలు పండాలని, యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభించాలని, ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.
మతసామరస్యం, పరస్పర గౌరవం తెలంగాణ సమాజానికి ప్రత్యేక గుర్తింపు అని పేర్కొన్న ఆయన, అన్ని మతాలు, అన్ని పండుగలను సమాన గౌరవంతో జరుపుకోవడం మన సంస్కృతి గొప్పతనమని అన్నారు. ప్రతి సంవత్సరం ఇదే భక్తిశ్రద్ధలతో బోనాల ఉత్సవాలను నిర్వహిస్తూ సంప్రదాయాలను పరిరక్షించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మహమ్మద్ ఇలియాస్‌ను ఘనంగా సన్మానించి, కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్, ఇంద్రకరణ్ రెడ్డి, ఐరేని సందీప్, భీమ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, ఐరేని నర్సయ్య, సుదర్శన్, అనంతరెడ్డి, ఆశబోయిన శ్రీనివాస్, పాత రాజు, నౌసిలాల్ నాయక్, గంప ప్రసాద్, కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, మహిళలు, భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

