సంతాపం తెలిపిన కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్, కవిత సహా పలువురు నేతలు
హైదరాబాద్, జూలై 31 (నవజ్యోతి ప్రతినిధి):
బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి (51) శుక్రవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జూలై 26న హనుమకొండలో గుండెపోటుకు గురికావడంతో తొలుత స్థానిక ఆస్పత్రికి తరలించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. ఐదు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందిన ఆయన మెదడుకు తీవ్ర ఆక్సిజన్ లోపం కారణంగా కోలుకోలేక మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు.
1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రైతు కుటుంబంలో జన్మించిన సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి 2001లో టీఆర్ఎస్‌లో చేరారు. అదే ఏడాది నల్లబెల్లి జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2015లో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌గా పనిచేసి, 2018లో నర్సంపేట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు.
ఆయన మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తెలంగాణ ఉద్యమంలో తనకు అత్యంత సన్నిహిత సహచరుడిని కోల్పోయానన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవితతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
© Copyright 2026 | నవజ్యోతి తెలుగు దినపత్రిక
All Rights Reserved.

