📄 ePaper
Thursday, July 30, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్తెలంగాణపై మళ్లీ భారీ వర్షాల హెచ్చరిక !

తెలంగాణపై మళ్లీ భారీ వర్షాల హెచ్చరిక !

 

ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్.. కామారెడ్డితో పాటు ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

హైదరాబాద్, జూలై 30 (నవజ్యోతి ప్రతినిధి):

తెలంగాణలో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమ-మధ్య ఛత్తీస్‌గఢ్, విదర్భ, ఆగ్నేయ మధ్యప్రదేశ్ ప్రాంతాలపై కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం, చురుకైన నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు మరింత ఉద్ధృతం కానున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న అల్పపీడనం వచ్చే 12 నుంచి 24 గంటల్లో బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ, తెలంగాణపై దీని ప్రభావం కొనసాగుతుందని తెలిపింది.

 

రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.

 

నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్ధిపేట, వికారాబాద్, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

 

హైదరాబాద్‌లో రెండ్రోజులు వర్షాలే

హైదరాబాద్ నగరంలో వచ్చే 24 గంటల పాటు ఆకాశం మేఘావృతంగా ఉండటంతో పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 27 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. అనంతరం 48 గంటల్లో కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొనసాగనున్నాయని తెలిపింది.

 

ఆగస్టు 1 నుంచి తగ్గనున్న వర్షాల తీవ్రత

గురువారం రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో, శుక్రవారం అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగస్టు 1 నుంచి వర్షాల తీవ్రత తగ్గి కొద్ది ప్రాంతాలకే పరిమితం కానుందని, ఆగస్టు 5 వరకు అక్కడక్కడా మాత్రమే వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 5 వరకు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కొనసాగవచ్చని హెచ్చరించింది.

ఉత్తర తెలంగాణలో ఇప్పటికే భారీ వర్షాలు

గత 24 గంటల్లో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో అనేక ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, జగిత్యాల, ములుగు, పెద్దపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యాయి. ఉత్తర తెలంగాణలోని మరిన్ని జిల్లాల్లో గణనీయమైన వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ వెల్లడించింది.

 

ప్రజలకు సూచనలు

భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నీటితో నిండిన రహదారులపై అత్యవసరమైతేనే ప్రయాణాలు చేయాలని, లోతట్టు ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలవవద్దని సూచించారు. గాలుల ప్రభావానికి ఎగిరిపోయే వస్తువులను భద్రపరచుకోవాలని, జిల్లా యంత్రాంగం, వాతావరణ శాఖ జారీ చేసే అధికారిక హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!