- ఐవైసీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను వెంటనే పునరుద్ధరించాలి
- మెటా నిష్పాక్షికంగా వ్యవహరించాలని రోషిని కుషాల్ జైష్వాల్ డిమాండ్
హైదరాబాద్, జూలై 29 (నవజ్యోతి ప్రతినిధి):
భారతీయ యువజన కాంగ్రెస్ (ఐవైసీ) అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బుధవారం అందుబాటులో కనిపించకపోవడంతో దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ యువజన కాంగ్రెస్ ఇన్‌చార్జ్ రోషిని కుషాల్ జైష్వాల్ స్పందిస్తూ, ఐవైసీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను వెంటనే పునరుద్ధరించాలని మెటా సంస్థను డిమాండ్ చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల అభిప్రాయాలను వ్యక్తీకరించే వేదికగా సామాజిక మాధ్యమాలు ఉండాలని, రాజకీయ పక్షపాతం లేకుండా మెటా నిష్పాక్షికంగా వ్యవహరించాలని ఆమె కోరారు. లక్షలాది మంది యువతతో అనుసంధానమైన అధికారిక వేదిక అకస్మాత్తుగా అందుబాటులో లేకపోవడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు.
యువజన కాంగ్రెస్ చేపడుతున్న నిరుద్యోగం, విద్య, సామాజిక న్యాయం వంటి అంశాలపై జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకునే పరిస్థితులు ఏర్పడకూడదని ఆమె అన్నారు. ఈ ఘటనపై మెటా సంస్థ పూర్తి పారదర్శకతతో వివరణ ఇవ్వడంతో పాటు, ఖాతాను అత్యవసరంగా పునరుద్ధరించాలని కోరారు.
ఐవైసీ ఖాతా పునరుద్ధరణ కోసం దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో #RestoreIYCInstagram హ్యాష్‌ట్యాగ్‌తో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. పలువురు కాంగ్రెస్ నాయకులు కూడా ఖాతా పునరుద్ధరణకు మద్దతుగా పోస్టులు చేస్తున్నారు.
అయితే, ఐవైసీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అందుబాటులో లేకపోవడానికి గల కారణాలపై మెటా సంస్థ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఖాతా పునరుద్ధరణ కోసం యువజన కాంగ్రెస్ శ్రేణులు తమ డిమాండ్‌ను మరింత ఉధృతం చేస్తున్నాయి.

