చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన బంధువులు.. జండా గల్లి నుంచి ఊరడమ్మ వరకు పండుగ శోభ
భిక్కనూరు, జూలై 19 (నవజ్యోతి ప్రతినిధి):
ఆషాఢ మాసం సందర్భంగా భిక్కనూరు మండల కేంద్రంలో ఆదివారం మహంకాళి అమ్మవారికి బోనాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. “నెత్తి మీద బోనం ఎత్తుకున్నది పల్లె…” అంటూ బోనాల పల్లె పాటలు మారుమోగుతుండగా డప్పుల దరువులు, పోతరాజుల వీర విన్యాసాలు, డీజే సౌండ్కు యువత నృత్యాలు, బాణసంచా వెలుగుల నడుమ బోనాల ఊరేగింపు వైభవంగా సాగింది.
మున్నూరు కాపు సంఘం, నాయి బ్రాహ్మణ సేవా సంఘం, కుమ్మరి సంఘాల ఆధ్వర్యంలో భక్తులు వేర్వేరుగా బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. జండా గల్లి నుంచి ప్రారంభమైన బోనాల ఊరేగింపు ప్రధాన వీధుల గుండా ఊరడమ్మ ఆలయానికి చేరుకుని, అక్కడి నుంచి మల్లికార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని మహంకాళి అమ్మవారు, భూలక్ష్మమ్మ ఆలయాలకు చేరుకుంది. అక్కడ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.
బోనాల సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో భిక్కనూరుకు తరలిరావడంతో ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. ఇంటింటా బంధువుల రాకతో సందడి కనిపించగా, ప్రధాన వీధులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. మహిళలు భక్తిశ్రద్ధలతో తలపై బోనాలు మోసుకుంటూ ఊరేగింపులో పాల్గొనగా, పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మార్గమంతా ప్రజలు ఇళ్ల ముందు నిలబడి బోనాల ఊరేగింపును తిలకించారు.
అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. సాయంత్రం ఆయా సంఘాల ఆధ్వర్యంలో గ్రామదేవతలకు కూడా సంప్రదాయబద్ధంగా బోనాలు సమర్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. భక్తి, సంప్రదాయం, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాఢమాస బోనాలు భిక్కనూరులో ఘనంగా నిర్వహించారు.

