📄 ePaper
Monday, August 10, 2026
📄 ePaper
Homeసంగారెడ్డిడీఎస్పీ భీమ్ రెడ్డిపై ఏసీబీ మెరుపు దాడులు.. నగదు, బంగారం, భారీ ఆస్తుల వెలికితీత

డీఎస్పీ భీమ్ రెడ్డిపై ఏసీబీ మెరుపు దాడులు.. నగదు, బంగారం, భారీ ఆస్తుల వెలికితీత

పటాన్చెరు, జులై 2(నవజ్యోతి ప్రతినిధి):

తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్లో  డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్  విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీమ్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును అవినీతి నిరోధక శాఖ  నమోదు చేసింది.

సేవా కాలంలో అవినీతి మార్గాల ద్వారా తెలిసిన ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై, అవినీతి నిరోధక చట్టం-1988 (2018 సవరణ)లోని సెక్షన్లు 13(1)(బి), 13(2) కింద కేసు నమోదు చేశారు.

ఈ మేరకు గురువారం డీఎస్పీ నివాసంతో పాటు ఆయన బంధువులు, స్నేహితులు, బినామీలు, అనుచరులకు చెందిన మొత్తం 16 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

సోదాల్లో హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్ వెస్సెల్లా మెడోస్‌లో విల్లా, టెలికాం నగర్‌లో జి+2+పెంట్ హౌస్, సాయి ప్రభా రెసిడెన్సీలో ఫ్లాట్, గచ్చిబౌలిలోని క్రాంతి సియాన్ అపార్ట్‌మెంట్స్‌లో ఫ్లాట్, మణికొండలో జి+5 వాణిజ్య సముదాయంలో వాటా, మరో వాణిజ్య స్థలం, తెల్లాపూర్‌లో రెండు ఫ్లాట్లు, ప్రగతి రిసార్ట్స్ సమీపంలో స్థలం, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో 3.5 ఎకరాల వ్యవసాయ భూమి, కర్ణాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూములు, బెంగళూరులోని దేవనహళ్లిలో ఒక ఎకరం భూమి, నాగోల్, పటాన్‌చెరు, వికారాబాద్ జిల్లాలోని మోమిన్‌పేట్ తదితర ప్రాంతాల్లో స్థలాలు, అలాగే ఎం/ఎస్ శ్రీ రాఘవేంద్ర రాక్ సాండ్ మినరల్స్‌లో రూ.75 లక్షల పెట్టుబడి, సీసీ కుంట మండలం ముచింతల గ్రామంలో 4.20 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు లభ్యమైనట్లు ఏసీబీ వెల్లడించింది.

అదేవిధంగా డీఎస్పీ నివాసంలో రూ.3.60 లక్షల నగదు, బినామీ ఇంట్లో రూ.40 లక్షల నగదు, సుమారు 2 కిలోల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి వస్తువులు, అలాగే రూ.19.91 లక్షల బ్యాంకు నిల్వలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

స్వాధీనం చేసుకున్న స్థిరాస్తుల పత్రాల్లో నమోదైన విలువ కంటే మార్కెట్ విలువ పలుమార్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఏసీబీ పేర్కొంది. కేసు దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!