సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సెక్షన్ అధికారి శ్రీనివాస్ గౌడ్
తూప్రాన్, సెప్టెంబర్ 16 (నవజ్యోతి ప్రతినిధి): తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ తండాలో మంగళవారం రాత్రి లేగ దూడపై చిరుత దాడి చేసి చంపిన ఘటన చోటుచేసుకుంది. సర్పంచ్ గొల్లపల్లి సంతోష్ రెడ్డి సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించి పాదముద్రలను చిరుతపులివిగా నిర్ధారించారు.
ఇస్లాంపూర్ తండాకు చెందిన లంబాడి రాజు ఎప్పటిలాగే రాత్రి పొలం వద్ద పశువులను కట్టేసిన సమయంలో సమీప అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత దాడి చేసి లేగ దూడను చంపినట్లు సెక్షన్ అధికారి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సమీప అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నందున గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
రాత్రివేళ పొలాల వద్ద పశువులను కట్టేయవద్దని – ఒంటరిగా పొలాలకు వెళ్లవద్దని, తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే వెంట కర్ర తీసుకెళ్లాలని సూచించారు. చిరుత దాడులతో పశువులను కోల్పోతున్నామని, అటవీ శాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

