📄 ePaper
Wednesday, August 26, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్గంజాయి కోసం రోడ్డుపైనే రచ్చ!

గంజాయి కోసం రోడ్డుపైనే రచ్చ!

డ్రైవర్‌ను అడ్డగించి బీర్‌ సీసాలతో దాడి.. ఇంటివరకు తరుముకొచ్చిన యువకులు

కుత్బుల్లాపూర్, ఆగస్టు 26 (నవజ్యోతి ప్రతినిధి): గంజాయి కోసం ఓ ర్యాపిడో డ్రైవర్‌పై యువకుల బృందం దాడికి పాల్పడిన ఘటన పేట్‌ బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని భాగ్యలక్ష్మీ కాలనీలో చోటుచేసుకుంది. రోడ్డుపై కారును అడ్డగించి గంజాయి కావాలంటూ డ్రైవర్‌ ఆకాష్‌ను వేధించిన యువకులు.. తన వద్ద లేదని చెప్పడంతో బీర్‌ సీసాలతో దాడి చేసినట్లు సమాచారం.

‘గంజాయి లేదు’ అన్నందుకు దాడి

సుమారు పది మంది యువకులు ఆకాష్‌ను చుట్టుముట్టి గంజాయి కోసం డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. తన వద్ద గంజాయి లేదని చెప్పడంతో వారు అతడిపై దాడికి పాల్పడినట్లు సమాచారం. బీర్‌ సీసాలతో దాడి చేయడంతో ఆకాష్‌ తలకు తీవ్ర గాయాలు కావడంతో పాటు చేయి విరిగినట్లు తెలుస్తోంది.

ఇంటివరకు వెంటాడిన యువకులు

దాడి నుంచి తప్పించుకునేందుకు ఆకాష్‌ సమీపంలోని తన రూమ్‌ వైపు పరుగులు తీయగా.. యువకులు అతడిని వెంబడించినట్లు సమాచారం. ఇంటి ఆవరణలోకి వెళ్లిన తర్వాత కూడా కట్టెలతో దాడి చేసినట్లు తెలుస్తోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు

ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డైనట్లు సమాచారం. రోడ్డుపై కారును అడ్డుకోవడం నుంచి బాధితుడిని ఇంటి వరకు వెంబడించి దాడి చేయడం వరకు జరిగిన పరిణామాలు కెమెరాల్లో నమోదైనట్లు తెలుస్తోంది.

గంజాయి సరఫరా ఎక్కడి నుంచి?

ఓ డ్రైవర్‌ను రోడ్డుపై అడ్డగించి గంజాయి కోసం డిమాండ్‌ చేసే స్థాయికి యువకులు రావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి గంజాయి ఎక్కడి నుంచి అందుతోంది? కాలనీలో మత్తు పదార్థాల విక్రయాలు జరుగుతున్నాయా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు గంజాయి సరఫరా మూలాలను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!