కాలేజీలకు హైడ్రా – ఇంటర్ బోర్డు దిశానిర్దేశం
హైదరాబాద్, ఆగస్టు 25 (నవజ్యోతి ప్రతినిధి): విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు విద్యార్థులు, బోధనా సిబ్బంది సురక్షితంగా బయటపడేలా అన్ని చర్యలు తీసుకోవాలని హైడ్రా, ఇంటర్ బోర్డు సూచించాయి. ఫేక్ ఫైర్ ఎన్వోసీల వ్యవహారంపై కేసులు, కాలేజీలపై చర్యల నేపథ్యంలో కాలేజీల నిర్వాహకులతో హైడ్రా, ఇంటర్ బోర్డు సంయుక్తంగా సమావేశం నిర్వహించాయి.
ఫైర్ ఎన్వోసీల విషయంలో నిబంధనలు పాటించకుండా విద్యార్థుల భద్రతను ప్రమాదంలోకి నెట్టొద్దని అధికారులు స్పష్టం చేశారు. అదే సమయంలో కాలేజీల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలు, నకిలీ ఫైర్ ఎన్వోసీలు పొందడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
రెండేళ్లకు ఒకసారి రెన్యూవల్ అవకాశం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ ఫైర్ ఎన్వోసీలను ప్రతి ఏడాది కాకుండా రెండేళ్లకు ఒకసారి రెన్యూవల్ చేసుకునే వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. కాలేజీల్లో రెండో మెట్లదారి ఉండేలా చర్యలు తీసుకోవాలని, పాత భవనాల్లో సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
ఫేక్ ఫైర్ ఎన్వోసీల పేరుతో కాలేజీల యాజమాన్యాలను ఇబ్బంది పెట్టడం హైడ్రా, ఇంటర్ బోర్డు ఉద్దేశం కాదని ఆయన స్పష్టం చేశారు.
ఆన్లైన్లోనే ఫైర్ ఎన్వోసీ దరఖాస్తులు
ఫైర్ ఎన్వోసీ, రెన్యూవల్ కోసం హైడ్రా అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రంగనాథ్ సూచించారు. బ్రోకర్లను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. దరఖాస్తు, అనుమతులు, పాత అనుమతుల రెన్యూవల్, ఫీజుల చెల్లింపులు ఆన్లైన్లోనే జరిగేలా ప్రక్రియను సరళీకరించినట్లు తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాలేజీలు కూడా ఆన్లైన్ విధానాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. ఫైర్ ఎన్వోసీల కోసం హైడ్రా కార్యాలయానికి నేరుగా రావాల్సిన అవసరం లేదన్నారు.
ఫేక్ ఎన్వోసీలపై లోతైన దర్యాప్తు
ఫేక్ ఫైర్ ఎన్వోసీల వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో గుర్తించేందుకు లోతైన దర్యాప్తు కొనసాగుతోందని రంగనాథ్ తెలిపారు. బాధ్యులపై చర్యలు తప్పవన్నారు. ఇంటర్ కాలేజీల యాజమాన్యాలు తమ వద్ద ఉన్న ఫైర్ ఎన్వోసీలు అసలైనవేనా కాదా పరిశీలించుకోవాలని సూచించారు.
ఫేక్ ఫైర్ ఎన్వోసీలు సమర్పించిన కాలేజీలకు విధించిన రూ.8 లక్షల జరిమానా విషయంలో పునరాలోచన చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు.
ఫైర్ నిబంధనలపై అవగాహన
హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య ఫైర్ సేఫ్టీ నిబంధనలను వివరించారు. ఇంటర్ బోర్డు సంయుక్త కార్యదర్శి వసుంధర సమావేశ వివరాలను వెల్లడించారు.

