ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తుల స్వీకరణ
హైదరాబాద్, ఆగస్టు 18 (నవజ్యోతి ప్రతినిధి):
తెలంగాణలో ఓటర్ల ముసాయిదా జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలను దాఖలు చేసేందుకు అవకాశం కల్పించినట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం వెల్లడించింది.
ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వలేకపోయినా అవకాశం
జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్ణయించిన సమయంలో ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించలేకపోయిన ఓటర్లు క్లెయిమ్స్, అభ్యంతరాల కాలంలో ఫారం-6తో పాటు నిర్దేశిత డిక్లరేషన్ ఫారం సమర్పించి ఓటరు జాబితాలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముసాయిదా ఓటరు జాబితాలో వివరాల సవరణకు, తప్పుగా చేర్చిన పేర్లపై అభ్యంతరాలు తెలిపేందుకు కూడా ఈ కాలాన్ని వినియోగించుకోవచ్చు.
ఏ ఫారంతో ఏ సేవ?
ఫారం-6: కొత్త ఓటరు నమోదు కోసం దరఖాస్తు.
ఫారం-6A: విదేశాల్లో నివసించే భారతీయ ఓటరు నమోదుకు దరఖాస్తు.
ఫారం-7: ఓటరు జాబితాలో ప్రతిపాదిత చేర్పుపై అభ్యంతరం లేదా ఇప్పటికే ఉన్న పేరును తొలగించేందుకు దరఖాస్తు.
ఫారం-8: నియోజకవర్గంలో లేదా వెలుపల నివాస మార్పు, వివరాల సవరణ, సవరణలు లేకుండా EPIC కార్డు స్థానంలో కొత్త కార్డు, దివ్యాంగ ఓటరుగా గుర్తింపు కోసం దరఖాస్తు.
119 ఈఆర్వోలు, 892 ఏఈఆర్వోలు
క్లెయిమ్స్, అభ్యంతరాల దరఖాస్తులను పరిశీలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 119 ఈఆర్వోలు, 892 ఏఈఆర్వోలు అందుబాటులో ఉన్నారు.
ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు
దరఖాస్తులను ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్, బూత్ లెవల్ అధికారుల వద్ద భౌతికంగా సమర్పించవచ్చు. voters.eci.gov.in వెబ్‌సైట్‌తో పాటు ECINET మొబైల్ యాప్ ద్వారా కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
క్లెయిమ్స్, అభ్యంతరాల జాబితా ఆన్లైన్లో
ఫారం-9, 10, 11, 11A, 11Bకు సంబంధించిన క్లెయిమ్స్, అభ్యంతరాల జాబితాను తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ప్రజలు జాబితాను పరిశీలించి, అవసరమైతే సంబంధిత ఈఆర్వో వద్ద అభ్యంతరాలు దాఖలు చేయవచ్చు.
ఈ జాబితాను ఈఆర్వోలు రాజకీయ పార్టీలకు ప్రతి వారం అందజేయనున్నట్లు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది.

