బొంగ్లూరులో ఆహార తయారీ కేంద్రంపై టాస్క్‌ఫోర్స్ దాడి.. రూ.4.07 లక్షల విలువైన పదార్థాలు స్వాధీనం
రంగారెడ్డి, ఆగస్టు 15 (నవజ్యోతి ప్రతినిధి):
బొంగ్లూరులో గడువు ముగిసిన ముడి పదార్థాలు, లేబుల్ లేని ఫ్లేవర్లు, పదార్థాలతో ఆహార ఉత్పత్తులు తయారు చేస్తున్న కేంద్రంపై హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ షంషాబాద్ జోన్ అధికారులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
అదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొంగ్లూరు గ్రామంలో కేఎస్ఎం ఫుడ్ ప్రొడక్ట్స్‌పై దాడి చేయగా.. గడువు ముగిసిన ముడి పదార్థాలతో పాటు అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాల తయారీ, నిల్వ చేస్తున్నట్లు గుర్తించారు. నిర్వాహకుడు మహ్మద్ ఖలీద్ (38), మేనేజర్ సంతోష్ కుమార్ (44)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రూ.4.07 లక్షల విలువైన పదార్థాలు స్వాధీనం
దాడిలో సుమారు 1,560 జార్ల సోన్‌పప్డీ, కాటన్ సోన్‌పప్డీ రూ.2.26 లక్షల విలువైనవి, 240 జార్ల పల్లి పట్టి/చిక్కీ రూ.34,800 విలువైనవి స్వాధీనం చేసుకున్నారు. అలాగే లేబుల్ లేని వివిధ ఫ్లేవర్లు, నాలుగు ప్యాకెట్ల కోకో పౌడర్, సుమారు 670 కిలోల బెల్లం స్వాధీనం చేసుకున్నారు.
గడువు ముగిసిన మైదా 50 కిలోల చొప్పున ఉన్న 72 బ్యాగులతో పాటు జీడిపప్పు, కొబ్బరి పొడి, ఇతర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాలు, ముడి పదార్థాల విలువ సుమారు రూ.4.07 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాల కోసం..
తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందేందుకు గడువు ముగిసిన ముడి పదార్థాలు, లేబుల్ లేని ఫ్లేవర్లను ఉపయోగించినట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న వస్తువులను అదిబట్ల పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై క్రైమ్ నంబర్ 659/2026గా బీఎన్ఎస్ సెక్షన్లు 275, 318(4) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వినియోగదారులకు పోలీసుల సూచనలు
ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలు కొనుగోలు చేసే సమయంలో తయారీ తేదీ, గడువు తేదీ, బ్యాచ్ నంబర్, పదార్థాల వివరాలు, లేబులింగ్‌ను పరిశీలించాలని పోలీసులు ప్రజలకు సూచించారు. గడువు ముగిసిన, దెబ్బతిన్న, సక్రమంగా లేబుల్ చేయని లేదా అపరిశుభ్రంగా నిర్వహిస్తున్న ఆహార పదార్థాలను కొనుగోలు చేయవద్దని కోరారు.

