📄 ePaper
Saturday, August 15, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ !

బీసీ మహిళలకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ !

119 నియోజకవర్గాల్లో 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లు.. ఆగస్టు 15 నుంచి దరఖాస్తులు

హైదరాబాద్‌, ఆగస్టు 13 (నవజ్యోతి ప్రతినిధి):
బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం
‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని ప్రారంభించింది. రవాణా, బీసీ సంక్షేమ శాఖ
మంత్రి పొన్నం ప్రభాకర్‌ గురువారం డా. బి.ఆర్. అంబేద్కర్‌ సచివాలయంలో ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున
మొత్తం 1,19,000 ఆటోమేటిక్‌ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నారు.

100 శాతం సబ్సిడీపై ఉచితంగా..

ఒక్కో కుట్టు మిషన్‌ విలువ రూ.12 వేలు కాగా.. లబ్ధిదారులకు 100 శాతం సబ్సిడీపై
ఉచితంగా అందజేయనున్నారు. అర్హులైన బీసీ మహిళల నుంచి
ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్‌ 15 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.

ప్రాధాన్యత ఎవరికి?

  • అత్యంత పేద బీసీ మహిళలు
  • వితంతువులు
  • ఒంటరి మహిళలు
  • నిరాశ్రయులు, అనాథలు
  • వికలాంగులు
  • కుట్టు వృత్తిలో అనుభవం ఉన్న మహిళలు

నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక
పారదర్శకంగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరుగుతుందని చెప్పారు. కుట్టు మిషన్ల
వినియోగంపై అవసరమైన శిక్షణ కూడా అందించనున్నట్లు వెల్లడించారు.

మహిళలకు స్వయం ఉపాధే లక్ష్యం

మొదటి దశలో 1.19 లక్షల మంది అర్హులకు ప్రయోజనం కల్పిస్తామని, భవిష్యత్‌లో పథకాన్ని
మరింత విస్తరిస్తామని మంత్రి తెలిపారు. బీసీ మహిళలను కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా
స్వయం ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని
పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు.

ఇంటి నుంచే కుట్టు వృత్తి ద్వారా ఆదాయం పొందేలా మహిళలకు ఈ పథకం ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు.

పూలే దంపతుల విగ్రహాల ఆవిష్కరణ

ఈనెల 14న సాయంత్రం 4 గంటలకు హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ ఎదురుగా ముఖ్యమంత్రి
రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు
మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమానికి బీసీ ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని
పిలుపునిచ్చారు.

ఈనెల 18న సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై
ఆయన విగ్రహాన్ని సీఎం ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, బిర్ల ఐలయ్య,
పలువురు ఎమ్మెల్యేలు, వివిధ కులాల కార్పొరేషన్‌ చైర్మన్లు, బీసీ సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!