రాజకీయంగా ఎదుర్కోలేక బ్యానర్ చించివేత.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి: కౌన్సిలర్ జైపాల్ నాయక్
తూప్రాన్, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి):
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని మహంకాళి జాతర సందర్భంగా జెండా వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బ్యానర్‌పై ఉన్న తన ఫొటోను గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి చించివేశారని 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ రాథోడ్ జైపాల్ నాయక్ తెలిపారు.
బ్యానర్‌పై ఉన్న తన ఫొటోను మాత్రమే చించివేయడం వెనుక రాజకీయ కక్ష ఉందని జైపాల్ నాయక్ ఆరోపించారు. గిరిజన బిడ్డగా తాను రాజకీయంగా ఎదుగుతుండటాన్ని కొందరు ఓర్వలేకపోతున్నారని, నేరుగా ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.
తనను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ఉంటే నేరుగా ఎదుర్కోవాలని, బ్యానర్లు చించి చిల్లర రాజకీయాలకు పాల్పడటం సరికాదని జైపాల్ నాయక్ అన్నారు. తనపై ఉన్న అక్కసును బ్యానర్‌పై చూపిస్తూ పైశాచిక ఆనందం పొందడం తగదని పేర్కొన్నారు.
ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు జైపాల్ నాయక్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపినట్లు పేర్కొన్నారు.

