దరఖాస్తులకు ఆగస్టు 22 చివరి తేదీ.. 200 సీట్లు
హైదరాబాద్, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): నీట్-2027 దీర్ఘకాలిక కోచింగ్ కోసం తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) దరఖాస్తులను ఆహ్వానించింది. 2026-27 విద్యా సంవత్సరానికి హైదరాబాద్లోని చిలుకూర్ టీజీఎస్డబ్ల్యూఆర్ ఫౌండేషన్ సీవోఈలో బాలురకు, మహేంద్రహిల్స్ ఫౌండేషన్ సీవోఈలో బాలికలకు ఉచితంగా రెసిడెన్షియల్ కోచింగ్ అందించనున్నారు.
ఈ కార్యక్రమంలో మొత్తం 200 సీట్లు ఉండగా.. బాలురకు 100, బాలికలకు 100 సీట్లు కేటాయించారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ (బీపీసీ) పూర్తి చేసి ఉత్తీర్ణులైన, నీట్-2026 పరీక్షకు హాజరైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ తదితర అర్హత కలిగిన వర్గాల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హులైన విద్యార్థులు టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ అధికారిక వెబ్సైట్లో నోటిఫికేషన్, దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చు. ఫారాన్ని పూర్తిగా నింపి అవసరమైన ధ్రువపత్రాలను జతచేసి సంబంధిత టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ జిల్లా కోఆర్డినేటర్ (డీసీవో)కు సమర్పించాలి. డీసీవోల వివరాలు సంస్థ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి.
దరఖాస్తు రుసుము లేదు
ఈ కోచింగ్ కార్యక్రమానికి ఎలాంటి దరఖాస్తు రుసుము లేదని టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ (ఎఫ్ఏసీ) కార్యదర్శి కంభంపాటి శారద తెలిపారు. దరఖాస్తుల సమర్పణకు ఆగస్టు 22 చివరి తేదీ. అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వైద్య విద్యలో తమ లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని ఆమె సూచించారు.

