చేగుంట మహంకాళి ఆలయంలో హుండీ ఎత్తుకెళ్లిన దుండగుడు.. సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు
చేగుంట, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): చేగుంట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో గుర్తుతెలియని దుండగుడు చోరీకి పాల్పడ్డాడు. ఆదివారం బోనాల ఉత్సవాలు ముగియగా.. మంగళవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. అదే రోజు అర్ధరాత్రి ముసుగు ధరించిన వ్యక్తి ఆలయం తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి హుండీని ఎత్తుకెళ్లాడు. దీంతో ఆలయంలో చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బుధవారం ఉదయం ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆలయంలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ముసుగు ధరించిన వ్యక్తి ఆలయంలోకి ప్రవేశించి హుండీని తీసుకెళ్తున్న దృశ్యాలు కెమెరాల్లో రికార్డ్ అయింది. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
హుండీలో ఎంత నగదు ఉంది, నిందితుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడనే వివరాలు తెలియాల్సి ఉంది. చోరీపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
చేగుంట పట్టణ నడిబొడ్డున, మెదక్ ప్రధాన రహదారికి ఆనుకుని, పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఆలయంలోనే చోరీ జరగడం చర్చనీయాంశంగా మారింది. ప్రధాన రహదారులు, వాణిజ్య ప్రాంతాలు, ఆలయాలు, ఇతర ముఖ్య ప్రదేశాల్లో నిఘాను మరింత పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
మనోహరాబాద్‌లో వైన్‌షాప్ చోరీ, కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో ట్రాన్స్ఫార్మర్ల చోరీ ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో తాజాగా చేగుంటలో ఆలయంలో హుండీ చోరీ జరగడం ఆందోళన కలిగిస్తోంది. వరుస చోరీలను అరికట్టేందుకు పోలీసులు రాత్రివేళల్లో గస్తీ, నిఘాను మరింత పెంచాలని ప్రజలు కోరుతున్నారు.

