📄 ePaper
Tuesday, September 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్పోతంగల్‌ వద్ద 8.86 కిలోల గంజాయి పట్టివేత !

పోతంగల్‌ వద్ద 8.86 కిలోల గంజాయి పట్టివేత !

మహారాష్ట్ర సరిహద్దుకు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.. నిందితుడి అరెస్టు

కోటగిరి, ఆగస్టు 12 (నవజ్యోతి ప్రతినిధి): పోతంగల్‌ గ్రామ సమీపంలోని మంజీరా నది తొలి వంతెన వద్ద పోలీసులు 8.86 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్‌ మండలం పోచారం తండాకు చెందిన 38 ఏళ్ల బర్దల్‌ పచిరామ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

పోలీసుల సమాచారం ప్రకారం.. ఆగస్టు 11న సాయంత్రం 4.30 గంటలకు బీర్కూర్‌ మీదుగా పోతంగల్‌ వైపు ఓ వ్యక్తి గంజాయి తరలిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి, వారి అనుమతితో పోలీసులు తనిఖీలకు సిద్ధమయ్యారు. పంచ సాక్షులు, ఎలక్ట్రానిక్‌ వెయింగ్‌ మెషీన్‌, ఎక్సైజ్‌ సిబ్బందితో కలిసి సాయంత్రం 6 గంటలకు పోతంగల్‌ మంజీరా నది తొలి వంతెన వద్దకు చేరుకున్నారు.

పారిపోయేందుకు యత్నం.. వెంబడించి పట్టివేత

సాయంత్రం 6.30 గంటలకు పోతంగల్‌ వైపు నుంచి మహారాష్ట్ర సరిహద్దు దిశగా బ్యాగ్‌తో నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు. పోలీసులను చూసి అతడు పారిపోయేందుకు ప్రయత్నించగా వెంబడించి పట్టుకున్నారు. అతడి బ్యాగ్‌ను పంచ సాక్షుల సమక్షంలో తనిఖీ చేయగా ఆరు ప్యాకెట్లలో ఎండిన మొక్క పదార్థం లభించింది. ఎక్సైజ్‌ సిబ్బంది దానిని గంజాయిగా గుర్తించినట్లు సమాచారం.

పచిరామ్‌ విచారణలో తెలిపిన వివరాల ప్రకారం.. వ్యవసాయంలో సరైన లాభాలు రాకపోవడంతో పాటు కొత్త ఇంటి నిర్మాణానికి అప్పులు కావడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి విక్రయానికి ప్రయత్నించినట్లు తెలిసింది. సుమారు నాలుగు నెలల క్రితం పిట్లం గ్రామానికి చెందిన రామ్‌దాస్‌ ద్వారా ఒడిశాకు చెందిన చోటు పరిచయమయ్యాడని, అతడి ద్వారా గంజాయి తెప్పించుకున్నట్లు తెలిపినట్లు సమాచారం.

రూ.40 వేలకు 10 కిలోలు కొనుగోలు

సుమారు 70 రోజుల క్రితం చోటు రైలులో కామారెడ్డికి వచ్చి గంజాయి తీసుకురాగా, పచిరామ్‌ రూ.40 వేలతో 10 కిలోలు కొనుగోలు చేసి ఇంటి వద్ద గడ్డివాములో దాచినట్లు తెలిపాడు. జూన్‌ 15న డెగ్లూర్‌లో సాథి అనే వ్యక్తికి 250 గ్రాముల గంజాయిని రూ.4 వేలకు విక్రయించినట్లు, అనంతరం సాథి ఫోన్‌ చేసి పోతంగల్‌ వద్ద మహారాష్ట్ర సరిహద్దుకు గంజాయి తీసుకురావాలని కోరినట్లు సమాచారం.

దీంతో ఆగస్టు 11న మధ్యాహ్నం 3.30 గంటలకు గంజాయిని బ్యాగులో పెట్టుకుని బస్సులో బాన్సువాడ, అక్కడి నుంచి బీర్కూర్‌, అనంతరం లారీలో పోతంగల్‌కు చేరుకున్నాడు. అక్కడి నుంచి మహారాష్ట్ర సరిహద్దు వైపు కాలినడకన వెళ్తుండగా పోలీసులకు పట్టుబడినట్లు సమాచారం. గతంలో గంజాయి విక్రయాల ద్వారా వచ్చిన రూ.73 వేల నగదును ఎస్‌బీఐ ఖాతాలో జమ చేసినట్లు కూడా వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

8.860 కిలోల గంజాయి స్వాధీనం ( ప్యాకెట్ ల వారిగా) …
  • 1.560 కిలోలు
  • 1.970 కిలోలు
  • 1.960 కిలోలు
  • 1.120 కిలోలు
  • 1.210 కిలోలు
  • 1.040 కిలోలు

ఆరు ప్యాకెట్లలో మొత్తం 8.860 కిలోల గంజాయి ఉన్నట్లు తేలింది. దీని విలువ కిలో రూ.5 వేల చొప్పున సుమారు రూ.44,300గా పోలీసులు అంచనా వేశారు. గంజాయితో పాటు వివో 1820 మొబైల్‌ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు

సీజ్‌ ప్రక్రియను ఫొటోలు, వీడియోల ద్వారా రికార్డు చేసి ఎలక్ట్రానిక్‌ ఆధారాలను భద్రపరిచారు. అనంతరం నిందితుడిని, స్వాధీనం చేసుకున్న గంజాయిని కోటగిరి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటనపై కోటగిరి పోలీసులు ఎన్‌డీపీఎస్‌ చట్టంలోని 8(సి) రెడ్‌విత్‌ 20(బి)(ii)(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో గంజాయి పట్టుబడుతున్న ఘటనలు కలవరపెడుతున్నాయి. ఒకే రోజు కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో భారీగా గంజాయి పట్టుబడడం, అదే రోజు పోతంగల్‌ వద్ద 8.86 కిలోల గంజాయి పట్టుబడటం ఆందోళన కలిగించే విషయంగా మారింది. జిల్లాలో గంజాయి రవాణా, విక్రయాలపై పోలీసులు ఎప్పటికప్పుడు నిఘా పెంచి ఉక్కుపాదం మోపాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!