ఏడు ట్రాన్స్‌ఫార్మర్లపై దాడి.. నాలుగు ధ్వంసం చేసి కాపర్ వైర్లు చోరీ.. పోలీసులకు సవాల్‌గా వరుస ఘటనలు..
భిక్కనూరు, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి): భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లిలో సోమవారం అర్ధరాత్రి ట్రాన్స్‌ఫార్మర్ల దొంగలు రెచ్చిపోయారు. ఏడు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా.. నాలుగింటిని ధ్వంసం చేసి కాపర్ వైర్లను ఎత్తుకెళ్లారు. మిగతా మూడు ట్రాన్స్‌ఫార్మర్లలో అల్యూమినియం ఉండటంతో వాటిని వదిలేసినట్లు టీజీ ఎస్పీడీసీఎల్ ఏఈ బాలాజీ తెలిపారు.
కేతి రాములు, బాల్‌రెడ్డి, పెద్దోళ్ల అమృతరెడ్డి, పెద్దోళ్ల రమేష్‌రెడ్డితో పాటు పలువురు రైతులకు చెందిన ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీంతో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏడు ట్రాన్స్‌ఫార్మర్లపై దాడి చేసి.. నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ వైర్లను మాత్రమే ఎత్తుకెళ్లడం అనుమానాలకు తావిస్తోంది. కాపర్ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తించి టార్గెట్ చేస్తున్నారా? దొంగలకు ముందస్తు సమాచారం ఎవరి నుంచి అందుతోంది? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గురజకుంట, బస్వాపూర్, రాగట్లపల్లి, పెద్ద మల్లారెడ్డి ప్రాంతాల్లోనూ గతంలో 20 కి పైగా ట్రాన్స్‌ఫార్మర్ల చోరీలు జరిగాయి. గురజకుంటలో కాపర్ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి, అల్యూమినియం ఉన్న వాటిని వదిలేసిన ఘటనలు కూడా జరిగినట్లు సమాచారం. దీంతో వరుస ఘటనల వెనుక ఒకే ముఠా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ట్రాన్స్‌ఫార్మర్ ధ్వంసమైనప్పుడు విద్యుత్ వ్యవస్థలో రక్షణ చర్యగా ట్రిప్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఘటనలో ట్రిప్ ఎందుకు కాలేదు? అధికారులకు వెంటనే సమాచారం ఎందుకు అందలేదు? అన్న అంశాలను అధికారులు పరిశీలించాల్సి ఉంది. ట్రిప్పింగ్ వ్యవస్థపై అవగాహన ఉన్న వ్యక్తుల సహకారం ఏమైనా ఉందా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.
కాపర్ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లనే ఎంపిక చేసుకుంటున్న నేపథ్యంలో వాటి వివరాలు దొంగలకు ముందుగానే ఎలా తెలుస్తున్నాయన్నది కీలకంగా మారింది. ట్రాన్స్‌ఫార్మర్ల స్థానాలు, సామర్థ్యం, ఇతర వివరాలు బయటకు వెళ్తున్నాయా? భిక్కనూరు మీద అవగాహన ఉండి విద్యుత్ శాఖకు చెందిన ఎవరైనా సమాచారం చేరవేస్తున్నారా? అన్న కోణంలోనూ పోలీసులు విచారణ చేయాలి. అయితే విద్యుత్ శాఖ సిబ్బంది ప్రమేయానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు.
భిక్కనూరు మండలంలో వరుస చోరీల నేపథ్యంలో ఇతర ప్రాంతాల నుంచి ముఠాలు వస్తున్నాయా? స్థానికుల సహకారం ఉందా? అన్నదీ తేలాల్సి ఉంది. చోరీ చేసిన కాపర్ వైర్లు, కాయిల్స్ ఎక్కడ విక్రయిస్తున్నారు? వాటిని కొనుగోలు చేస్తున్న స్క్రాప్ వ్యాపారులు ఎవరు? అన్నదానిపైనా నిఘా పెంచాల్సిన అవసరం ఉంది.





ఘటనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని ఏఈ బాలాజీ తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నామని, దుండగులు మొత్తం ఏడు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా.. నాలుగు ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు ఎత్తుకెళ్లారని చెప్పారు. మిగతా మూడు ట్రాన్స్‌ఫార్మర్లలో అల్యూమినియం ఉండటంతో వాటిని వదిలేసినట్లు పేర్కొన్నారు.
వరుస చోరీలతో రైతులు నష్టపోతున్న నేపథ్యంలో రామేశ్వర్‌పల్లి ఘటనను సీరియస్‌గా తీసుకుని దుండగులను గుర్తించాలని రైతులు కోరుతున్నారు. దొంగలు ఎక్కడి నుంచి వచ్చారు? వారికి సమాచారం ఎవరిచ్చారు? ట్రిప్ ఎందుకు కాలేదు? కాపర్ ఎక్కడికి తరలించారు? అన్న ప్రశ్నలకు సమాధానాలు లభిస్తే ఈ వరుస చోరీల వెనుక అసలు గుట్టు బయటపడే అవకాశం ఉంది.

