షకీలా, దుర్గ కూడా జనజీవన స్రవంతిలోకి.. సమతకు రూ.20 లక్షల పునరావాస సాయం…
ములుగు, ఆగస్టు 11 (నవజ్యోతి ప్రతినిధి):
మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యురాలు కాకర్ల సమత తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమెతో పాటు మావోయిస్టు కార్యకలాపాల్లో ఉన్న షకీలా, దుర్గ కూడా లొంగిపోయినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ములుగులో జరిగిన కార్యక్రమంలో లొంగిపోయిన వారికి ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం ప్రయోజనాలు అందించారు.
సమత 1985లో మావోయిస్టు పార్టీలో సభ్యురాలిగా చేరారు. 1991లో ఏరియా కమిటీ సభ్యురాలిగా, 1994లో జిల్లా కమిటీ సభ్యురాలిగా ఎదిగారు. 2003లో రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. సుదీర్ఘకాలం మావోయిస్టు ఉద్యమంలో పనిచేసిన ఆమె తాజాగా పోలీసుల ఎదుట లొంగిపోయారు.
తెలంగాణ ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానం కింద సమతకు అర్హత మేరకు రూ.20 లక్షల రివార్డు మొత్తాన్ని చెక్కు రూపంలో అందజేశారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం పునరావాసం, ఆర్థిక సహాయం, ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని అధికారులు తెలిపారు.
తెలంగాణకు చెందిన ఇంకా క్రియాశీలంగా ఉన్న మిగిలిన ముగ్గురు మావోయిస్టు కేడర్ కూడా హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని పోలీసులు పిలుపునిచ్చారు. ప్రభుత్వ పునరావాస విధానాన్ని సద్వినియోగం చేసుకుని సాధారణ జీవితం ప్రారంభించాలని కోరారు.

