రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందజేత.. నల్లబెల్లిలో భారీగా తరలివచ్చిన బీఆర్‌ఎస్ శ్రేణులు…
వరంగల్, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి): తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం పరామర్శించారు. నల్లబెల్లిలోని పెద్ది స్వగృహానికి చేరుకున్న ఆయన ముందుగా సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం తల్లి, భార్య, పిల్లలను ఓదార్చి ధైర్యం చెప్పారు. సుదర్శన్‌రెడ్డి మృతితో భావోద్వేగానికి గురైన కేసీఆర్ కంటతడి పెట్టినట్లు సమాచారం.
ఈ సందర్భంగా పార్టీ తరఫున పెద్ది కుటుంబానికి ప్రకటించిన రూ.2.25 కోట్ల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఇందులో ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున రూ.2 కోట్లు, సుదర్శన్‌రెడ్డి తల్లి అమృతమ్మ సంక్షేమం కోసం రూ.25 లక్షలు బ్యాంకులో జమ చేయనున్నారు. పిల్లల చదువు, భవిష్యత్, కుటుంబ సంక్షేమాన్ని పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతి పార్టీకి, నర్సంపేట నియోజకవర్గానికి తీరని లోటని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన కుటుంబంతోపాటు పార్టీ శ్రేణులకు, నియోజకవర్గానికి పెద్ది నిర్వహించిన బాధ్యతలను బీఆర్‌ఎస్ అండగా నిలిచి కొనసాగిస్తుందని తెలిపారు.
కేసీఆర్ నల్లబెల్లి పర్యటనకు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మార్గమధ్యంలో పలుచోట్ల ఆయనకు స్వాగతం పలికారు. కొన్నిచోట్ల కేసీఆర్ కాన్వాయ్ ఆపి కార్యకర్తలను పలకరించి ధైర్యం చెప్పారు. నల్లబెల్లి పరిసరాల్లో భారీగా జనసమీకరణ కావడంతో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.
కేసీఆర్ రాక సందర్భంగా స్థానికులు కూడా తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. కాశిరెడ్డిపల్లిలో గ్రామస్తులు ఫంక్షన్‌హాల్ కిచెన్ షెడ్ నిర్మాణానికి రూ.63 లక్షలు మంజూరైనా పనులు ప్రారంభం కాలేదని వివరించగా, అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కేసీఆర్ హామీ ఇచ్చారు.

