కొమరం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి సీతక్క..
అశ్వరావుపేట, ఆగస్టు 9 (నవజ్యోతి ప్రతినిధి): ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని అశ్వరావుపేటలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి రాష్ట్ర మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఆదివాసీ స్వాతంత్ర్య సమరయోధుడు కొమరం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన భారీ ర్యాలీ ‘జై ఆదివాసీ’ నినాదాలతో మారుమోగింది.
సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసుల చరిత్ర హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, ఆత్మగౌరవం కోసం సాగిన పోరాటాల చరిత్రేనన్నారు. సమ్మక్క-సారక్క, బిర్సా ముండా, రాంజీ గోండు, కొమరం భీమ్ వంటి నాయకులు ఆదివాసీ హక్కుల కోసం పోరాడారని గుర్తుచేశారు. ఆదివాసీల హక్కుల పరిరక్షణకు రాజ్యాంగం ప్రత్యేక రక్షణలు కల్పించిందని, వాటిని అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత అన్నారు.
ఆదివాసీ హక్కుల కోసం పోరాడటం ఇతర వర్గాలకు వ్యతిరేకం కాదని, అందరితో సోదరభావంతో ముందుకు సాగుతూ రాజ్యాంగ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధి, ఇళ్లు, ఉద్యోగాలు, అడవిపై హక్కుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
ఆదివాసీల భాష, సంస్కృతి, సంప్రదాయాలు, వేషధారణ వారి అస్తిత్వానికి ప్రతీకలని, వాటిని కాపాడుకోవాలని సూచించారు. కొమరం భీమ్ స్ఫూర్తితో అభివృద్ధి, ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
అనంతరం మంత్రి సీతక్క అశ్వరావుపేటలోని మహిళా సమాఖ్య భవనాన్ని సందర్శించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

