ప్రమాదం తర్వాత మొదలైన ఒత్తిళ్లు.. బస్వాపూర్‌లో దంపతుల ఆత్మహత్యాయత్నం
బిక్కనూర్, ఆగస్టు 8 (నవజ్యోతి ప్రతినిధి): ఓ రోడ్డు ప్రమాదం.. ఓ కుటుంబంలో విషాదం.. ఆ తర్వాత పరిహారం చెల్లించాలన్న ఒత్తిడి.. చివరకు ఓ దంపతులు ఆత్మహత్యకు యత్నించే పరిస్థితి. బిక్కనూర్ మండలం బస్వాపూర్‌లో శనివారం చోటుచేసుకున్న ఘటన పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రమాదానికి సంబంధించిన పరిహారం వివాదం ఎంత దూరం వెళ్లిందనేదానికి ఈ ఘటన అద్దం పడుతోంది.
జూన్ 25న బస్వాపూర్ సమీపంలో ఆటో, కంటైనర్ ఢీకొన్న ప్రమాదంలో రమేశ్ గౌడ్ మృతి చెందగా, ఆటో నడుపుతున్న కుర్మిండ్ల శ్రీనివాస్ గౌడ్ గాయపడ్డాడు. ప్రమాదం తర్వాత మృతుడి కుటుంబానికి రూ.6 లక్షలు పరిహారంగా చెల్లించాలని గ్రామ పెద్దల సమక్షంలో నిర్ణయించినట్లు సమాచారం. దీనికి సంబంధించి బాండ్ పేపర్‌పై ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది.
మొదటగా రూ.లక్ష చెల్లించిన శ్రీనివాస్ గౌడ్ మిగిలిన రూ.5 లక్షలను రెండు వాయిదాల్లో చెల్లించేందుకు అంగీకరించినట్లు సమాచారం. అయితే గడువు వచ్చినా మొత్తం చెల్లించే స్థోమత లేకపోవడంతో మరికొంత సమయం కోరినట్లు తెలిసింది. ఇక్కడి నుంచే వివాదం ముదిరినట్లు తెలుస్తోంది.
మిగిలిన డబ్బులు చెల్లించాలంటూ తనపై ఒత్తిడి, వేధింపులు పెరిగాయని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కాసాల సత్యాగౌడ్ తనను వేధిస్తున్నారని పేర్కొంటూ శ్రీనివాస్ రాసినట్లు చెబుతున్న సూసైడ్ నోట్ పోలీసుల చేతికి చిక్కింది. తన మృతికి సత్యాగౌడ్ కారణమని, తన పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అందులో రాసినట్లు సమాచారం.
అయితే ఈ ఆరోపణలు, పరిహారం ఒప్పందం, వేధింపుల అంశాలపై పోలీసుల దర్యాప్తులో పూర్తి వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
శనివారం ఇంట్లో శ్రీనివాస్, శ్రీలత ఎలుకల మందు సేవించడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించి కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఇద్దరినీ నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అధిక మోతాదులో మందు తీసుకోవడంతో శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు, శ్రీలత ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు బంధువులు తెలిపారు.
ఘటనకు సంబంధించిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ప్రమాదం, పరిహారం ఒప్పందం, చెల్లింపుల గడువు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాల్సి ఉంది. పరిహారం కోసం జరిగిన ఒత్తిడి నిజంగా ఆత్మహత్యాయత్నానికి దారితీసిందా? లేక వివాదానికి మరేదైనా కారణం ఉందా? అన్నది దర్యాప్తులో తేలాల్సి ఉంది.

