భారత చట్టాలకే ప్రాధాన్యం.. ఫేస్బుక్లో భారీ మార్పులకు రంగం సిద్ధం…
న్యూఢిల్లీ, ఆగస్టు 7 (నవజ్యోతి ప్రతినిధి): భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న డిజిటల్ వేదికలు భారత చట్టాలకు పూర్తిగా లోబడాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. మెటా (ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్) అల్గారిథమ్‌లు, కంటెంట్ నియంత్రణ, డీప్‌ఫేక్‌లు, బాట్ల వినియోగం, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ మెటీరియల్ (CSAM) వంటి అంశాలపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం.
సమావేశంలో భారత చట్టాల అమలులో ఎలాంటి రాజీ ఉండబోదని కేంద్రం స్పష్టం చేసింది. అమెరికా లేదా ఇతర దేశాల నిబంధనల పేరుతో భారత్‌లో కార్యకలాపాలు సాగించడం కుదరదని, భారత చట్టాల ప్రకారమే కంటెంట్ మోడరేషన్, అల్గారిథమ్‌ల నిర్వహణ, వినియోగదారుల భద్రత ఉండాలని మెటా ప్రతినిధులకు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
కేంద్రం సూచనల నేపథ్యంలో మెటా కూడా కీలక మార్పులకు అంగీకరించినట్లు సమాచారం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికల్లో డీప్‌ఫేక్ వీడియోలను వేగంగా గుర్తించి తొలగించే వ్యవస్థను బలోపేతం చేయడం, చైల్డ్ సెక్సువల్ అబ్యూజ్ కంటెంట్‌ను గుర్తించే ఏఐ సాంకేతికతను మరింత విస్తరించడం, నకిలీ బాట్లు, ఫేక్ అకౌంట్లపై కఠిన చర్యలు తీసుకోవడం, ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో సమన్వయాన్ని పెంచడం వంటి చర్యలను అమలు చేయనున్నట్లు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
అలాగే అల్గారిథమ్‌ల పారదర్శకత, చట్టవిరుద్ధ కంటెంట్ నియంత్రణ, భారత వినియోగదారుల భద్రత అంశాల్లో మరిన్ని సంస్కరణలు తీసుకురావాలని కేంద్రం సూచించినట్లు సమాచారం. ఈ అంశాలపై మెటా గ్లోబల్ బృందం భారత ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తోంది.
డిజిటల్ వేదికలు దేశ భద్రత, ప్రజాస్వామ్య వ్యవస్థ, సామాజిక శాంతికి విఘాతం కలిగించేలా పనిచేయకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యమని కేంద్రం పేర్కొంటోంది. భారత డిజిటల్ ఎకోసిస్టమ్‌ను మరింత సురక్షితంగా, బాధ్యతాయుతంగా తీర్చిదిద్దే దిశగా ఈ చర్యలు కీలకంగా మారనున్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.

