బిట్స్ పిలానీ గోవా క్యాంపస్‌లో వెర్టికల్ ఫ్లో వెట్‌ల్యాండ్ టెక్నాలజీ పరిశీలన…
హైదరాబాద్, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి):
నగరంలోని చెరువుల్లోకి శుద్ధి చేసిన నీటిని తక్కువ ఖర్చుతో చేరవేసే సాంకేతికతపై హైడ్రా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బిట్స్ పిలానీ కేకే బిర్లా గోవా క్యాంపస్‌ను సందర్శించి వెర్టికల్ ఫ్లో కన్స్ట్రక్టెడ్ వెట్‌ల్యాండ్ టెక్నాలజీని అధ్యయనం చేశారు.
చెరువుల్లోకి మురుగునీరు చేరకుండా ఇప్పటికే ఇన్‌లెట్ల అభివృద్ధి చేపట్టిన హైడ్రా, ఇప్పుడు శుద్ధి చేసిన జలాలను చెరువుల్లోకి మళ్లించే విధానాలపై పరిశోధన చేస్తోంది. ఈ సందర్భంగా ఎస్‌బీఆర్, ఎంబీఆర్, వెట్‌ల్యాండ్ ట్రీట్‌మెంట్ వంటి సాంకేతికతలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను కమిషనర్ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో మురుగునీటిని శుద్ధి చేసే విధానాన్ని కూడా అధ్యయనం చేశారు.
తక్కువ విద్యుత్ వినియోగం, నిర్వహణ వ్యయం, దీర్ఘకాలిక సామర్థ్యం, పర్యావరణ పరిరక్షణలో ఈ సాంకేతికత ప్రయోజనకరంగా ఉంటుందని బిట్స్ పిలానీ నిపుణులు వివరించారు. నగరంలోని పాతబస్తీ బమృకున్-ఉద్-దౌలా చెరువులో తొలిదశగా ఈ విధానాన్ని అమలు చేసి ఫలితాలను పరిశీలించాలని నిర్ణయించినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
ఈ పర్యటనలో చెరువుల అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న విమోస్ టెక్నోక్రాఫ్ట్స్ అధినేత యూనస్ కూడా పాల్గొన్నారు.

