మూడు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్. ఆగస్టు 21 వరకు దరఖాస్తులకు అవకాశం
హైదరాబాద్, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి): రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) కాంట్రాక్ట్ ప్రాతిపదికన కాంట్రాక్ట్ ఇంజినీర్ (ఫీల్డ్ ఫైరింగ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం మూడు పోస్టులను భర్తీ చేయనుండగా, అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 21లోగా దరఖాస్తులు సమర్పించాలని సంస్థ సూచించింది.
నోటిఫికేషన్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.47,000 వేతనం అందించనున్నారు. ఇందులో రూ.42,000 కన్సాలిడేటెడ్ పే, రూ.4,000 రవాణా భత్యం, రూ.1,000 టెలిఫోన్ భత్యం ఉంటాయి. నాలుగేళ్ల కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం జరగనుండగా, ప్రతి ఏడాది పనితీరు ఆధారంగా కాంట్రాక్టును పొడిగించే అవకాశం ఉంటుంది.
డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా ఆర్మీ గుర్తింపు పొందిన ఎలక్ట్రానిక్స్ కోర్సు పూర్తి చేసిన మాజీ సైనికులు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 55 సంవత్సరాలు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపట్టనున్నారు. ఎంపికైన వారికి తెలంగాణలోని భానూర్ (సంగారెడ్డి జిల్లా)తో పాటు సంస్థ అవసరాలకు అనుగుణంగా ఇతర యూనిట్లలో కూడా పోస్టింగ్ ఇవ్వవచ్చని బీడీఎల్ తెలిపింది.
అభ్యర్థులు బయోడేటాతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను సంబంధిత ఏజెన్సీల ద్వారా సమర్పించాల్సి ఉంటుందని, ఆగస్టు 21లోగా బీడీఎల్‌కు చేరేలా పంపించాలని సంస్థ స్పష్టం చేసింది.

