చంటి బిడ్డ కోసం స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్సకు చర్యలు…
సంగారెడ్డి, ఆగస్టు 6 (నవజ్యోతి ప్రతినిధి):
ప్రజా ప్రతినిధి అంటే సభల్లో మాట్లాడేవాడు మాత్రమే కాదు… అవసరమైన సమయంలో ప్రజల పక్కన నిలబడేవాడని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి నిరూపించారు. అర్ధరాత్రి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాలుగు నెలల చిన్నారితో ఆస్పత్రికి వచ్చిన ఓ తల్లికి ఆయన అందించిన చేయూత స్థానికంగా ప్రశంసలు అందుకుంటోంది.
సంగారెడ్డికి చెందిన ప్రవళిక అనే మహిళ నాలుగు నెలల చంటి బిడ్డకు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో తీవ్ర ఆందోళనకు గురైంది. ఇంట్లో వృద్ధులైన అత్తామామలు అనారోగ్యంతో ఉండటం, భర్త డ్రైవింగ్ విధుల్లో బయట ఉండటంతో అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో రాపిడో ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకుంది. చేతిలో చలనం లేకుండా ఉన్న చిన్నారితో ఏ వార్డుకు వెళ్లాలో తెలియక ఆస్పత్రి ప్రాంగణంలోనే ఆందోళనగా నిలిచింది.
అదే సమయంలో ప్రభుత్వ ఆస్పత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహిస్తున్న జగ్గారెడ్డి ఆమె పరిస్థితిని గమనించారు. విషయం తెలుసుకున్న వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తల్లీబిడ్డను తన కారులో మాతా శిశు ఆస్పత్రి (ఎంసీహెచ్)కు తీసుకెళ్లారు. అక్కడ విధుల్లో ఉన్న వైద్యులతో మాట్లాడి అత్యవసర చికిత్స ప్రారంభించేలా చర్యలు తీసుకున్నారు.
వైద్యుల ప్రాథమిక పరీక్షల్లో వ్యాక్సిన్ అనంతర ప్రభావంతో చిన్నారికి ఫిట్స్ వచ్చినట్లు గుర్తించి వెంటనే చికిత్స అందించారు. అనంతరం చిన్నారి తండ్రితో కూడా ఫోన్‌లో మాట్లాడి వెంటనే ఆస్పత్రికి రావాలని సూచించినట్లు సమాచారం.
ఈ ఘటనలో కనిపించింది రాజకీయ నాయకుడి హోదా కంటే మానవత్వమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఆపదలో ఉన్న ఓ తల్లికి ధైర్యం చెప్పి, చిన్నారి చికిత్స కోసం స్వయంగా ముందుకు రావడం అభినందనీయమని స్థానికులు పేర్కొంటున్నారు.
ఈ సంఘటన మరో విషయాన్ని కూడా గుర్తు చేసింది. ప్రభుత్వ ఆస్పత్రులకు అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు మార్గనిర్దేశం చేసే సహాయక వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆ రాత్రి సరైన సమయంలో జగ్గారెడ్డి అక్కడ ఉండటంతో ఒక తల్లికి ధైర్యం, ఒక చిన్నారికి సకాలంలో వైద్యం అందిందని స్థానికులు చెబుతున్నారు.

