📄 ePaper
Thursday, August 6, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్బోనాల భద్రతలో షీ టీమ్స్ నిఘా..!

బోనాల భద్రతలో షీ టీమ్స్ నిఘా..!

సివిల్ డ్రెస్సులో నిఘా.. 678 మంది వేధింపుదారులు పట్టివేత

హైదరాబాద్, ఆగస్టు 5 (నవజ్యోతి ప్రతినిధి): బోనాల ఉత్సవాల సందర్భంగా మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ హైదరాబాద్ షీ టీమ్స్ నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో 678 మంది వేధింపుదారులను పోలీసులు పట్టుకున్నారు. మహిళలపై వేధింపులకు పాల్పడిన 25 మందికి కోర్టు జైలు శిక్ష విధించగా, మరికొంత మందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.

పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు దేవాలయాలు, ఊరేగింపు మార్గాలు, బస్ స్టాప్‌లు, మెట్రో స్టేషన్లు, మార్కెట్లు తదితర రద్దీ ప్రాంతాల్లో సివిల్ డ్రెస్సులో షీ టీమ్స్ సిబ్బంది మోహరించారు. హిడెన్ కెమెరాలు, వీడియో నిఘా ద్వారా మహిళలను వేధిస్తున్న వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. బోనాల బందోబస్తు సమయంలో మొత్తం 122 ఫిర్యాదులు నమోదయ్యాయి.

పట్టుబడిన వారిలో 25 మందికి కోర్టు జైలు శిక్షతో పాటు జరిమానా విధించగా, మరో 13 కేసుల్లో కూడా దర్యాప్తు పూర్తై శిక్షలు ఖరారయ్యాయి. మరో ప్రత్యేక డ్రైవ్‌లో 11 మందికి మూడు రోజుల వరకు సాధారణ జైలు శిక్షతో పాటు రూ.1,050 జరిమానా విధించారు. మరో 26 మందికి రూ.1,050 జరిమానాతో పాటు కమ్యూనిటీ సర్వీస్ చేయాలని కోర్టు ఆదేశించింది.

అమలు చర్యలతో పాటు అవగాహన కార్యక్రమాలనూ షీ టీమ్స్ విస్తృతంగా నిర్వహించాయి. నగరవ్యాప్తంగా 400 అవగాహన కార్యక్రమాలు, 110 నిఘా ఆపరేషన్లు చేపట్టి మహిళల భద్రత, సైబర్ నేరాలు, చట్టపరమైన హక్కులు, అత్యవసర సేవలపై ప్రజలకు అవగాహన కల్పించారు.

మహిళలపై వేధింపులు, వెంటాడటం, లైంగిక వేధింపులు, సైబర్ వేధింపులు లేదా సోషల్ మీడియా దుర్వినియోగం ఎదురైతే వెంటనే షీ టీమ్స్‌ను సంప్రదించాలని పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేయాలని లేదా 9490616555 వాట్సాప్ నంబర్‌కు సమాచారం పంపాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NJ News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!