మండల స్థాయికి విస్తరణ.. ప్రజలకు చేరువగా ఫిర్యాదుల పరిష్కారం.. దుర్వినియోగంపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం…
ప్రజల సమస్యల పరిష్కారాన్ని మరింత వేగవంతం చేసి, ప్రభుత్వ సేవలను గ్రామీణ స్థాయిలోనే అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించింది. ఈ మేరకు ప్లానింగ్ (వి) శాఖ జీఓ ఎంఎస్ నెం.4ను మంగళవారం జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి రానున్నాయి.
ప్రతి సోమవారం ప్రజావాణి
ఉత్తర్వుల ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల పరిషత్ (ఎంపీడీవో) కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించనున్నారు. ఎంపీడీవోను నోడల్ అధికారిగా నియమించారు. తహసీల్దార్, ఎంపీవో, వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, విద్య, వైద్య, ఐసీడీఎస్, బీసీ, మైనార్టీ, గిరిజన సంక్షేమ, గృహనిర్మాణ, విద్యుత్, ఆర్అండ్బీ, ఇరిగేషన్, అటవీ, మున్సిపల్ తదితర శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులను స్వీకరించి చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.
ప్రత్యేక నమోదు కేంద్రం
ప్రతి ఫిర్యాదును ప్రజావాణి పోర్టల్లో నమోదు చేసి గ్రీవెన్స్ ఐడీతో కూడిన రసీదు అందజేస్తారు. ప్రతి మండలంలో కంప్యూటర్, స్కానర్, ఇంటర్నెట్ సౌకర్యాలతో ప్రత్యేక నమోదు కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, చిన్నారులతో వచ్చే మహిళలకు ప్రాధాన్యం కల్పించనున్నారు.
ప్రజలకు చేరువగా సేవలు
ప్రజావాణిని మండల స్థాయికి విస్తరించడం ద్వారా ప్రజలు జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే స్థానికంగానే తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభించనుంది. జిల్లా కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
దుర్వినియోగంపై అప్రమత్తత అవసరం
అయితే వ్యక్తిగత కక్షలు, నిరాధార ఆరోపణలు లేదా బ్లాక్మెయిల్ ఉద్దేశాలతో కొందరు ప్రైవేట్ వ్యక్తులపై తప్పుడు ఫిర్యాదులు చేసే అవకాశం, స్థానిక అధికారుల విధులకు ఆటంకం కలిగించడం ఇలాంటివి పూర్తిగా తోసిపుచ్చలేమని పలువురు అభిప్రాయపడుతున్నారు. అలాంటి ఫిర్యాదులపై అధికారులు వాస్తవాలను సమగ్రంగా పరిశీలించి, నిరాధార ఫిర్యాదులకు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

